సాకర్ మాంత్రికుడు డీగో మారడోనా ఇక లేరు..
Diego Maradona Dies At 60. అర్జెంటీనా పుట్‌బాల్ దిగ్గజం, సాకర్ మాంత్రికుడు డీగో మారడోనా కన్నుమూశారు. గుండెపోటుతో
By Medi Samrat Published on 26 Nov 2020 6:20 AM GMTఅర్జెంటీనా పుట్‌బాల్ దిగ్గజం, సాకర్ మాంత్రికుడు డీగో మారడోనా కన్నుమూశారు. గుండెపోటుతో బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మారడోనా.. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్నారు. నవంబర్ 12న కోలుకొని ఇంటికి కూడా చేరుకున్నాడు. అయితే రెండు వారాల వ్యవధిలోనే తుది శ్వాస విడిచాడు.
మారడోనా అసలు పేరు 'డీగో అర్మాండో మారడోనా'. 1960 అక్టోబరు 30న అర్జెంటీనా, బ్యూన్‌సఎయిర్స్‌లో పేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి డిగో మారడోనా, తల్లి డల్మా సాల్వర్డో ప్రాంకో. నలుగురు అమ్మాయిల తర్వాత మారడోనా జన్మించాడు. అతడిని ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. ఎనిమిదేళ్ల వయసులోనే ఆటలో అద్భుతాలు చేసేవాడు. ఎనిమిదేళ్ల వయసులో స్థానికంగా జూనియర్ ట్రయల్స్ కోసం వెళ్లినప్పుడు అతని ఆటను చూసి కోచ్ ఫ్రాన్సిస్కో కార్నెజో అబ్బురపడ్డాడు.
ఫుట్‌బాల్ ప్రపంచంలో ఎన్నో అరుదైన, లెక్కలేనన్ని ఘనతలు సొంతం చేసుకున్న డీగో.. 1986లో అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్ కప్ అందించాడు. మెరుపు గోల్స్ కొడుతూ.. పుట్‌బాల్ ఆటలో ది గోల్డెన్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. 1990లో అతని సారథ్యంలోనే అర్జెంటీనా రన్నరప్‌గా నిలిచింది. చనిపోయే సమయానికి మారడోనా అర్జెంటీనా ప్రీమియర్ డివిజన్ క్లబ్ జిమ్నాసియా (సీజీఈ)కి కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. కెరీర్ చివర్లో వచ్చిన వివాదాలతో అప్పటి వరకు సాధించిన ఘనతలపై నీలి నీడలు కమ్ముకున్నా... మైదానంలో అతని మంత్రముగ్ధమైన ఆటను చూసినవారెవరూ మారడోనాను మరచిపోలేరు. 'గోల్డెన్ బాయ్'గా మారడోనా సాధించిన ఖ్యాతి అజరామరం.
మారడోనా మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. భారత క్రికెట్‌లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నుంచి కోచ్ రవిశాస్త్రి దాకా చాలా మంది మారడోనాకు అభిమానులే...
*క్రీడా ప్రపంచానికి, పుట్‌బాల్ క్రీడకు ఇది తీరని లోటు. నేను పుట్‌బాల్ ఇష్టపడేందుకు కారణం మీరే. మీ ఆత్మకు శాంతి కలగాలి ఛాంపియన్ డిగో - అనిల్ కుంబ్లే
*పుట్‌బాల్ దిగ్గజాల్లో ఒకరైనా డిగో మారడోనా మనల్ని విడిచి వెళ్లిపోయారు. క్రీడా ప్రపంచానికి ఇదో బాధాకరమైన సందర్భం. అతడి ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి - వీవీఎస్ లక్ష్మణ్
*దిగ్గజ ఆటగాడు మారడోనా మృతి చెందారని తెలిసి చాలా బాధగా ఉంది. అతడు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాడు. తన ఆటతో మైదానంలో మధుర జ్ఞాపకాలు మిగిల్చాడు. రెస్ట్ ఇన్ పీస్ డిగో. మిమ్మల్ని కోల్పోతున్నాం - యువరాజ్ సింగ్