Paris Olympics : అసామాన్యుడు.. అనుమానం రాకుడ‌ద‌నే గోల్డ్ మెడల్ సాధించలేదట‌..!

పారిస్ ఒలింపిక్స్-2024 జరుగుతోంది. ఆగస్టు 1వ తేదీ గురువారం వరకూ భారత్ మొత్తం మూడు పతకాలు సాధించింది.

By Medi Samrat  Published on  1 Aug 2024 4:21 PM IST
Paris Olympics : అసామాన్యుడు.. అనుమానం రాకుడ‌ద‌నే గోల్డ్ మెడల్ సాధించలేదట‌..!

పారిస్ ఒలింపిక్స్-2024 జరుగుతోంది. ఆగస్టు 1వ తేదీ గురువారం వరకూ భారత్ మొత్తం మూడు పతకాలు సాధించింది. మూడు పతకాలు షూటింగ్‌లో వచ్చాయి. ఇదిలావుంటే.. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో 51 ఏళ్ల టర్కిష్ షూటర్ యూసుఫ్ డికెచ్ తన భాగస్వామి సెవ్వల్ ఇలయిడా తర్హాన్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రజత పతకాన్ని గెలుచుకుని రికార్డ్ సృష్టించాడు. ఎలాంటి ప్రత్యేక పరికరాలు లేకుండానే యూసుఫ్ డికెచ్ ఈ ఘనత సాధించడం అత్యంత ఆసక్తికరమైన విషయం. యూసుఫ్ డికేచ్ గురించి ప్ర‌స్తుతం ఇంటర్నెట్‌లో తీవ్ర‌మైన చ‌ర్చ జ‌రుగుతుంది. షూటింగ్ స‌మ‌యంలో అద్దాలు మాత్రమే ధరించి ఫైనల్‌లో గురి చూస్తున్న ఫోటోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి.

టర్కీ ఎయిర్ పిస్టల్ షూటర్ యూసుఫ్ డికేచ్ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న తర్వాత సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. 51 ఏళ్ల యూసుఫ్ డికేచ్.. తన కింది జేబులో ఒక చేయి వుంచి లక్ష్యం వైపు గురిపెట్టిన వీడియో సోషల్ మీడియాలో ప్ర‌స్తుతం వైరల్ అవుతోంది.

ప్రత్యేక గాగుల్స్, లెన్స్‌, హియ‌ర్‌పాడ్ వంటివి ధరించి ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ పోటీలో పాల్గొన్న ఇతర అథ్లెట్‌లతో యూసుఫ్ డికేచ్‌ను పోల్చుతూ.. సాధారణ అద్దాలు, సాధారణ చెవి ప్లగ్‌లను మాత్రమే ధరించి జేబులో ఒక చేత్తో.. రజత పతకాన్ని గెలుచుకున్నాడని కొనియాడుతున్నారు. టర్కీ ఒలింపిక్స్‌కు రహస్య గూఢచారి, హిట్‌మ్యాన్‌ను పంపిందని.. అనుమానం రాకుడ‌ద‌నే.. ఉద్దేశపూర్వకంగా గోల్డ్ మెడల్ సాధించలేదని కొందరు చమత్కరించారు.

మంగళవారం జరిగిన ఈవెంట్‌లో సెర్బియాకు చెందిన జోరానా అరునోవిచ్, డామిర్ మైకెక్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. వారు టర్కికు చెందిన సెవ్వల్ ఎలైడా తర్హాన్, యూసుఫ్ డికెచ్‌లను 16-14తో ఓడించారు. భారత్‌కు చెందిన మను భాకర్, సరబ్జోత్ సింగ్ 16-10తో దక్షిణ కొరియా జోడీ ఓహ్ యె-జిన్, లీ వాన్-హోను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

Next Story