భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. శనివారం సోషల్ మీడియా వేదికగా అభిమానులను ఉద్దేశించి మహేంద్రుడు పెట్టిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర వార్తతో మీ ముందుకు వస్తానని ధోని చెప్పాడు. దీంతో ఈ జార్ఖండ్ డైనమేట్ ఎలాంటి న్యూస్ చెబుతాడోనని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మాత్రమే ఆడుతున్నాడు. దీంతో ఐపీఎల్‌కు కూడా గుడ్ బై చెప్పనున్నాడా అని పలువురు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. లేదంటే ఏదైనా కొత్త బిజినెస్ కు సంబంధించిన వెంచర్ గురించి చెబుతాడా అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
గత ఐపీఎల్ సీజన్ ఆరంభం కానున్న సమయంలో చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు ధోని. జడేజా సారధిగా బాధ్యతలు చేపట్టినా వరుస పరాజరాలు పలకరించడంతో తిరిగి మహినే కెప్టెన్‌గా కొనసాగాడు. ఈ క్రమంలో ధోని పెట్టిన పోస్ట్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. "మీ నుంచి ఎలాంటి చెడు వార్త రాకూడని కోరుకుంటున్నాం" అని కామెంట్లు చేస్తున్నారు.