భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారణ కొనసాగుతోందని ధనశ్రీ తరఫు న్యాయవాది ధృవీకరించారు.
ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ అయిన ధనశ్రీ చాహల్ నుండి రూ. 60 కోట్ల భరణం అడిగారని కొందరు కొన్ని రోజులుగా చాలా వార్తలు వచ్చాయి. ధనశ్రీ కుటుంబ సభ్యులు పుకార్లను పూర్తిగా కొట్టివేశారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దని కోరారు. భరణం ఎంత అడిగాము అనే విషయం గురించి చెలామణి అవుతున్న నిరాధారమైన వాదనలపై మేము తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. అటువంటి మొత్తాన్ని ఎన్నడూ అడగలేదు, డిమాండ్ చేయలేదు లేదా ఆఫర్ చేయలేదని అన్నారు. ఈ పుకార్లలో ఏమాత్రం నిజం లేదు. కేవలం పార్టీలనే కాకుండా వారి కుటుంబాలను కూడా అనవసర వివాదాల్లోకి లాగుతూ, ధృవీకరించని సమాచారాన్ని ప్రచురించడం తీవ్ర బాధ్యతారాహిత్యమని ధనశ్రీ కుటుంబ సభ్యులు తెలిపారు.
విడాకులు ఇప్పటికే ఫైనల్ అయ్యాయని కొన్ని నివేదికలు కూడా ఉన్నాయి. అయితే అలాంటి నివేదికలను కూడా ధనశ్రీ తరపు న్యాయవాదులు కొట్టివేశారు.