కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్న 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్'
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ క్రికెట్‌లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు.
By - Medi Samrat |
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ క్రికెట్‌లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ రాబోయే సీజన్‌కు ఢాకా క్యాపిటల్స్ అక్తర్‌ను మెంటార్‌గా నియమించింది. 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్'గా ప్రసిద్ధి చెందిన షోయబ్ అక్తర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన బంతిని వేసిన బౌలర్‌గా రికార్డును సొంతం చేసుకున్నాడు. అక్తర్ గతంలో పలు టీ20 లీగ్‌లలో సలహాదారు పాత్రల్లో కూడా పనిచేశాడు.
ఢాకా క్యాపిటల్స్ సీఈఓ అతిక్ ఫహద్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ అక్తర్ నియామకాన్ని ధృవీకరించారు. 'మేము రాబోయే BPL సీజన్‌లో ఢాకా క్యాపిటల్స్‌కు మెంటార్‌గా షోయబ్ అక్తర్‌ను చేర్చుకున్నాము. మేము రెండు కారణాల వల్ల అక్తర్‌ని ఎంచుకున్నాము. మొదటది ఆయన బ్రాండ్ వ్యాల్యూ, రెండవది ఆయన ఆటగాళ్లను ప్రోత్సహించే విధానం.. 'సీజన్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు షోయబ్ అక్తర్ ఇక్కడికి వస్తాడు. మేము ఆయనతో కొన్ని ఎండార్స్‌మెంట్‌లు చేస్తాము. అది పూర్తయిన తర్వాత ఆయన వెళ్లిపోతాడు. ఆ తర్వాత సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లలో యువకులకు మార్గనిర్దేశం చేస్తాడు. మేము గత సంవత్సరం సయీద్ అజ్మల్‌ని తీసుకువచ్చాము. అక్తర్ పాత్ర కూడా అలాగే ఉంటుందని పేర్కొన్నాడు.
50 ఏళ్ల షోయబ్ అక్తర్ 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించి మొత్తం 444 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. ఢాకా క్యాపిటల్స్ అక్తర్‌తో ఒప్పందం కుదుర్చుకోగా.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పాలకమండలి 2026 సీజన్ కోసం ఆటగాళ్ల వేలాన్ని నవంబర్ 30న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ముందుగా నవంబర్ 23న నిర్వహించాల్సి ఉంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ త్వరలో జరగనుంది.