గంభీర్‌కు కోర్టులో ద‌క్క‌ని ఊర‌ట‌

భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, అతని సంస్థ (గంభీర్ ఫౌండేషన్) మరియు కుటుంబ సభ్యులపై ట్రయల్ కోర్టు విచారణను నిలిపివేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.

By Medi Samrat
Published on : 25 Aug 2025 7:15 PM IST

గంభీర్‌కు కోర్టులో ద‌క్క‌ని ఊర‌ట‌

భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, అతని సంస్థ (గంభీర్ ఫౌండేషన్) మరియు కుటుంబ సభ్యులపై ట్రయల్ కోర్టు విచారణను నిలిపివేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. గౌతమ్‌ గంభీర్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ నీనా బన్సాల్‌కృష్ణ.. ఆగస్టు 29న దీనిపై సమగ్ర విచారణ జరుపుతుందని సోమ‌వారం తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, ఏప్రిల్ 9న ట్రయల్ కోర్టు విచారణపై స్టే ఎత్తివేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని గౌతమ్ గంభీర్ విజ్ఞప్తి చేశారు.

ఈ కేసు విచారణ సందర్భంగా గౌతమ్ గంభీర్ తరపు న్యాయవాది తన రాజకీయ, క్రికెట్ కెరీర్ గురించి ప్రస్తావించగా.. కోర్టు కఠిన స్వరంతో 'మీరు పదేపదే మీ పేరు, గుర్తింపును ప్ర‌స్తావిస్తే కోర్టులో ఎలాంటి ప్రభావం ఉండ‌దు. కోర్టులో వాస్తవాలు, చట్టం మాత్రమే ప్రబలంగా ఉంటాయి, పేర్లు కాదు అని మంద‌లించింది.

గౌతమ్ గంభీర్ తరపున న్యాయవాది జై అనంత్ దేహదరాయ్ మాట్లాడుతూ.. తన క్లయింట్ మాజీ ఎంపీ, మాజీ క్రికెట్ కెప్టెన్, ప్రస్తుత కోచ్ అని తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆయ‌న‌ ప్రజలకు సహాయం చేయడానికి ఉచిత ఆక్సిజన్ సిలిండర్లు, మందులను పంపిణీ చేశాడు. అయితే ఈ కేసులో ఈ విషయాలు ప్రసక్తి లేదని హైకోర్టు పేర్కొంది.

2021లో కోవిడ్-19 సెకండ్‌ వేవ్ సమయంలో ఢిల్లీ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ గంభీర్, అతని సంస్థపై ఫిర్యాదు చేసింది. గంభీర్ ఫౌండేషన్, అతని కుటుంబం లైసెన్స్ లేకుండా కోవిడ్ మందులను నిల్వ చేసి పంపిణీ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో ట్రయల్ కోర్టు గౌతమ్ గంభీర్, అతని భార్య నటాషా గంభీర్, తల్లి సీమా గంభీర్, ఫౌండేషన్ సీఈవో అపరాజితా సింగ్‌లకు సమన్లు ​​జారీ చేసింది. అందరిపైనా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టంలోని సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.

సెక్షన్ 18(సి) ప్రకారం.. లైసెన్స్ లేకుండా ఔషధాల తయారీ, అమ్మకం లేదా పంపిణీ నిషేధం. సెక్షన్ 27(B)(ii) ప్రకారం.. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే కనీసం మూడేళ్లు, గరిష్టంగా ఐదేళ్ల జైలు మరియు జరిమానా విధించబడుతుంది.

సెప్టెంబర్ 2021లో హైకోర్టు ట్రయల్ కోర్టు కార్యకలాపాలపై స్టే విధించింది. డ్రగ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ నుండి ప్రతిస్పందనను కోరింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 9న కోర్టు స్టే ఎత్తివేసింది.

Next Story