ఓటమికి కారణాలు చెప్పిన పంత్
రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు IPL-2025ని విజయవంతంగా మొదలుపెట్టాలని చూసింది.
By Medi Samrat
రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు IPL-2025ని విజయవంతంగా మొదలుపెట్టాలని చూసింది. అయితే అశుతోష్ శర్మ అనే తుఫాను వచ్చి వారి కలను విచ్ఛిన్నం చేసింది. అశుతోష్ అద్భుతమైన అర్ధ సెంచరీ చేసి ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఒక వికెట్ తేడాతో గెలిపించాడు. ఈ ఓటమి తర్వాత పంత్ నిరాశకు గురయ్యాడు.. తమ జట్టు గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయిన కారణంగా ఎక్కడ తప్పు చేసిందో చెప్పాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నికోలస్ పూరన్ 30 బంతుల్లో 75 పరుగులు, మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 72 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ 19.3 ఓవర్లలో సాధించింది. ఢిల్లీ 65 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కానీ అశుతోష్ 31 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో 15 బంతుల్లో 39 పరుగులు చేసిన విప్రజ్ నిగమ్ కూడా అతనికి మద్దతు ఇచ్చాడు. అతని ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. వీరిద్దరూ 22 బంతుల్లో 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా ఢిల్లీని మళ్లీ మ్యాచ్‌లోకి తీసుకొచ్చారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత పంత్ నిరాశతో తన జట్టు ఎక్కడ తప్పు చేసిందో చెప్పాడు. పంత్ మాట్లాడుతూ.. “బోర్డుపై చాలా పరుగులు ఉన్నాయని నేను భావిస్తున్నాను. మా బ్యాట్స్‌మెన్ బాగా బ్యాటింగ్ చేశారు. మేము మిడిల్ ఓవర్లలో ఊపందుకోవాలి.. కానీ ఈ వికెట్‌లో ఈ స్కోరు బాగుంది. ఖచ్చితంగా మేము ఈ మ్యాచ్ ఓటమి నుంచి నేర్చుకుంటామని పేర్కొన్నాడు. మా టీమ్ పని చేయాల్సి ఉందని పంత్ చెప్పాడు. బేసిక్స్‌పై మనం ఎంత బాగా పనిచేస్తామో.. అంత మంచిగా ఉంటామని నేను భావిస్తున్నానన్నాడు. ఢిల్లీ విజయానికి హీరోలుగా నిలిచిన అశుతోష్, విప్రజ్‌లను కొనియాడుతూ.. ఢిల్లీ జట్టు భాగస్వామ్యాలు చాలా బాగున్నాయి. మొదట స్టబ్స్‌తో భాగస్వామ్యం ఆపై అశుతోష్-విప్రజ్‌ల భాగస్వామ్యం.. పాత బంతి బౌలర్లకు సహాయపడుతుందని నేను భావించాను, కానీ మేము మా బేసిక్స్‌ను మరింత మెరుగ్గా అమలు చేయాలన్నాడు.