చెన్నై కు షాకిచ్చిన ఢిల్లీ.. ధోని దంచుడు వృధా..!
MS ధోని విశాఖపట్నంలో సూపర్ సిక్సర్లతో అభిమానులను అలరించినా.. చెన్నై జట్టు ఢిల్లీని ఓడించలేకపోయింది.
By Medi Samrat Published on 1 April 2024 8:34 AM ISTMS ధోని విశాఖపట్నంలో సూపర్ సిక్సర్లతో అభిమానులను అలరించినా.. చెన్నై జట్టు ఢిల్లీని ఓడించలేకపోయింది. వైజాగ్‌లోని ఢిల్లీ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రెండు అద్భుతమైన విజయాలతో టోర్నమెంట్ ను ప్రారంభించగా.. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బలహీనతలు బహిర్గతమయ్యాయి. సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. 20 పరుగుల తేడాతో ఓడిపోయారు. అయితే MS ధోని అత్యుత్తమ ప్రదర్శనను చూసి విశాఖపట్నం ప్రేక్షకులు తెగ ఆనందపడిపోయారు. ఆఖరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నార్ట్జే పై 2 భారీ సిక్సర్లను బాదాడు. ధోని 16 బంతుల్లో 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు, 3 సిక్సర్లు, 4 బౌండరీలతో CSK నెట్ రన్ రేట్ దెబ్బ తినకుండా చూసుకున్నాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 191/5 స్కోరు చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్(51) ఈ మ్యాచ్‌లో మాత్రం చెలరేగాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్(52) కూడా అర్ధ శతకం బాదగా.. పృథ్వీ షా(43) సైతం మెరిశాడు. చెన్నయ్ బౌలర్లలో పతిరణ(3/31) రాణించాడు. 192 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో 171/6 స్కోరుకే పరిమితమైంది. అజింక్య రహానే(45), మిచెల్(34), ధోనీ(37), జడేజా(21 నాటౌట్) రాణించారు. అప్పటికీ చెన్నై ఓటమి ఖరారు అయినా ధోనీ మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 3 వికెట్లు, ఖలీల్ అహ్మద్ 2, అక్షర్ పటేల్‌కు ఒక్క వికెట్ దక్కింది.