ఐపీఎల్ 2025లో తొలిసారిగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక జట్టు సహాయక సిబ్బందిలో సభ్యుడికి జరిమానా విధించింది. ఏప్రిల్ 16 బుధవారం న్యూఢిల్లీలో రాజస్థాన్ రాయల్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్య విజయం సాధించిన తర్వాత, ఆ జట్టు బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్‌కు ఐపీఎల్ యాజమాన్యం జరిమానా విధించింది.
ప్రవర్తనా నియమావళిని పాటించడంలో విఫలమైనందుకు మునాఫ్ పటేల్‌కు ఓ డీమెరిట్ పాయింట్, అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. మునాఫ్ పటేల్ ఆర్టికల్ 2.20 కింద లెవల్ 1 నేరాన్ని అంగీకరించాడని ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ క్యాపిటల్స్ 188 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంటున్న సమయంలో మునాఫ్ నాల్గవ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. సబ్ స్టి ట్యూట్ ఫీల్డర్ ద్వారా ఆటగాళ్లకు సందేశాన్ని పంపడంపై మునాఫ్ వాదనకు దిగినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది.