క్రికెట్ ఆడినందుకు చిన్నతనంలో నా తండ్రి బెల్టుతో కొట్టాడు.. ఖలీల్ అహ్మద్ ఎమోషనల్ జర్నీ
Delhi Capitals Bowler Khaleel Ahmed Emotional. ఖలీల్ అహ్మద్.. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన ఎడమచేతి వాటం బౌలర్.
By Medi Samrat Published on 29 March 2023 3:13 PM GMTDelhi Capitals Bowler Khaleel Ahmed
ఖలీల్ అహ్మద్.. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన ఎడమచేతి వాటం బౌలర్. టీమిండియాకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఖలీల్ ఇప్పుడున్న ఈ స్థాయిని చేరుకునేందుకు ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌కు ముందు ఆకాష్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడాడు. తను క్రికెట్ ఆడటం తన తండ్రికి (ఖలీల్ అహ్మద్ తండ్రికి) ఇష్టం లేదని చెప్పాడు. చిన్నతనంలో క్రికెట్ ఆడినందుకు తన తండ్రి తనను బెల్టుతో కొట్టాడని భారత క్రికెటర్ ఖలీల్ అహ్మద్ చెప్పాడు. శరీరంపై గాయాలు చాలా తీవ్రంగా అయ్యేవి. తన అక్కలు రాత్రిపూట గాయాలపై లేపనం రాసేవారని పేర్కొన్నాడు.
ఖలీల్ అహ్మద్ ఇంకా మాట్లాడుతూ.. తనకు ముగ్గురు అక్కలు ఉన్నారని.. తన తండ్రి టోంక్ జిల్లాలోని ఒక ఆసుపత్రిలో కాంపౌండర్ అని చెప్పాడు. చిన్నప్పటి నుంచి తనకు ఆటలంటే చాలా ఇష్టం. తండ్రి ఆసుపత్రికి వెళ్తే.. ఇంటి పనులన్నీ ఖలీల్‌పై పడేవి. ఆటల మీద ధ్యాస ఉండటంతో ఆ పనులు అసంపూర్తిగా మిగిలిపోయేవి. దీంతో తల్లి తన తండ్రికి ఫిర్యాదు చేసేదని ఇంటర్వ్యూలో ఖలీల్ చెప్పాడు. నేను తరచుగా మైదానంలో ఉండేవాడిని. నేను ఏ పనీ చేయకపోయేవాడిని.. చదువుకునేవాడిని కాదు.. దీంతో నా తండ్రి బెల్టుతో కొట్టేవాడు. దానివల్ల నా వంటిపై వాతలు వచ్చేవి. మా సోదరి ఆ గుర్తులపై లేపనం వేసేది.. నా శరీరంపై ఇప్పటికీ ఆ గుర్తులు ఉన్నాయని పేర్కొన్నాడు.
మా నాన్న కాంపౌండర్, నేను వైద్య రంగంలో ఏదైనా చేయాలనుకున్నాడు. నన్ను డాక్టర్‌ని చేయాలనుకున్నాడు. భవిష్యత్తులో నేను ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండకూడదని అతను నిర్ధారించుకున్నాడు. అయితే.. క్రికెట్‌లో పేరు తెచ్చుకోవడంతో.. తన తండ్రి తనకు మద్దతు ఇవ్వడం ప్రారంభించాడని ఖలీల్ చెప్పాడు. ఈ విషయంలో విఫలమైతే పింఛన్‌లోంచి మొత్తం ఖర్చులు భరిస్తానని తండ్రి ఓ రోజు చెప్పాడని ఖలీల్ చెప్పాడు. U14లో రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికైనప్పుడు ఈ మార్పు జరిగిందని ఖలీల్ చెప్పాడు. ఖలీల్ నాలుగు మ్యాచ్‌ల్లో 21 వికెట్లు పడగొట్టాడు. అది వార్తాపత్రికలలో రావడంతో మానసికంగా అటాచ్ అయ్యాడని ఖలీల్ పేర్కొన్నాడు.