తగ్గట్లేదు.. మహేంద్ర సింగ్ ధోనీపై పరువు నష్టం దావా
మహేంద్ర సింగ్ ధోని మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, అతని భార్య సౌమ్య దాస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
By Medi Samrat Published on 17 Jan 2024 8:51 PM ISTమహేంద్ర సింగ్ ధోని మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, అతని భార్య సౌమ్య దాస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ధోనీపై ఈ జంట పరువు నష్టం దావా వేశారు. మిహిర్ దివాకర్, ఆయన భార్య సౌమ్య దాస్ గతంలో ధోనీతో కలిసి బిజినెస్ చేశారు. తప్పుడు ఆరోపణల ద్వారా ధోనీ తమ పరువుకు భంగం కలిగిస్తున్నారని.. దీనికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తప్పుడు ఆరోపణలతో తమపై కేసు నమోదు చేయడం ద్వారా ధోనీ తమ పురువుకు భంగం కలిగించేలా వ్యవహరించారని మిహిర్ దంపతులు ఆరోపించారు. దీనికి పరిహారం చెల్లించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. సోషల్ మీడియాతోపాటు, మీడియాలో తమకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయకుండా చూడాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. మిహిర్ దివాకర్ దంపతులు దాఖలు చేసిన పరువునష్టం దావాను జనవరి 18న జస్టిస్ ప్రతిభ ఎం. సింగ్ విచారించనున్నారు.
కొద్దిరోజుల కిందట ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌కు చెందిన మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాస్ లపై క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని రాంచీ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అకాడమీని నెలకొల్పేందుకు దివాకర్ 2017లో ధోనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందంలో పేర్కొన్న షరతులను పాటించడంలో దివాకర్ విఫలమయ్యారు. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ కోర్టును ఆశ్రయించారు. రిమైండర్‌లు, లీగల్ నోటీసులు కూడా పంపినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని చెబుతున్నారు. ఆర్కా స్పోర్ట్స్ కారణంగా తాము మోసపోయామని, ఫలితంగా రూ. 15 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని చెప్పారు. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌కు చెందిన ఇద్దరు అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.