బెంబేలెత్తించిన ఐర్లాండ్.. కష్టంగా గెలిచిన భారత్
Deepak Hooda's maiden century helps India beat Ireland by 4 runs.చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో టి20లో
By తోట వంశీ కుమార్ Published on 29 Jun 2022 8:49 AM ISTచివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో టి20లో భారత్ 4 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. పసికూన జట్టే అయినా ఐర్లాండ్ చాలా గొప్పగా పోరాడింది. భారీ లక్ష్యాన్ని దాదాపుగా చేధించినంత పని చేసింది. సిరీస్‌ను 2-0తో భారత్ గెలుచుకున్నప్పటికీ తమ పోరాటంతో ఐర్లాండ్.. క్రికెట్ అభిమానుల మనసులను గెలుచుకుంది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. దీపక్ హుడా (104; 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా, సంజు శాంసన్ ( 77; 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సత్తా చాటాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరుపున శతకం సాధించిన నాలుగో ఆటగాడిగా హుడా రికార్డులెక్కాడు.
ఇషాన్ కిషన్(3) తొందరగానే పెవిలియన్ చేరినా.. దీపక్ హుడా, శాంసన్ జోడి ఐర్లాండ్ బౌలర్లపై విరుచుకుపడింది. ఇద్దరూ పోటాపోటిగా బౌండరీలు బాదారు. వీరిద్దరు 87 బంతుల్లో 176 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓ దశలో భారత్ 250 పరుగులు చేసేలా కనిపించింది. అయితే.. చివరి నాలుగు ఓవర్లలో ఐర్లాండ్ బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు తీయడంతో భారత్ 225 పరుగులకే పరిమితమైంది. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ మూడు, జోష్ లిటిల్, క్రెయిగ్ యాంగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ బాల్‌బిర్నె ( 60; 37 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు), పాల్ స్టిర్లింగ్ ( 40; 18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), హ్యారీ టెక్టర్ (39; 28 బంతుల్లో 5 ఫోర్లు), డాక్‌రెల్ (34 నాటౌట్; 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) లు రాణించడంతో ఐర్లాండ్ లక్ష్యానికి చేరువైంది.
ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు అవసరం కాగా.. ఉమ్రాన్ మాలిక్ తొలి బంతికి పరుగులు ఇవ్వలేదు. రెండో బంతికి నోబాల్ వేశాడు. అడైర్ వరుసగా రెండు బౌండరీలు బాదడంతో సమీకరణం 3 బంతుల్లో 8 పరుగులు గా మారింది. ఈ దశలో ఉమ్రాన్ చక్కగా బౌలింగ్ చేసి కేవలం 3 పరుగులే ఇవ్వడంతో భారత్ ఊపిరిపీల్చుకుంది. భారత బౌలర్లలో భువనేశ్వర్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.