దీపక్ హుడా గోల్డెన్ లెగ్ ప్లేయర్.. అతడు ఆడితే ఇండియా గెలవాల్సిందే
Deepak Hooda creates new world record after India’s win in 2nd ODI.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో పాటు దేశవాలీ
By తోట వంశీ కుమార్ Published on 21 Aug 2022 6:13 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో పాటు దేశవాలీ క్రికెట్‌లో సత్తా చాటడంతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు ఆల్‌రౌండర్ దీపక్ హుడా. ఇప్పటి వరకు తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ టీమ్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు. తాజాగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో సైతం 25 పరుగులు చేయడంతో పాటు ఓ వికెట్ తీసి భారత విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం సాధించడంతో దీపక్ హుడా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన తరువాత హుడా ఇప్పటి వరకు టీమ్ఇండియా తరుపున 16 మ్యాచ్‌లు ఆడగా అన్నింటిలోనూ భారత్ విజయం సాధించింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. దీన్ని బట్టి దీపక్ హుడా గోల్డెన్ లెగ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. హుడా ఇప్పటి వరకు 9 టీ20లు, 7 వన్డేల్లో టీమ్ఇండియాకు ప్రాధాన్యం వహించాడు.
కాగా.. గతంలో ఈ రికార్డు రొమేనియాకు చెందిన సాత్విక్ నడిగొటియా పేరిట ఉంది. అతడు అరంగ్రేటం చేసిన తరువాత రొమేనియా వరుసగా 15 మ్యాచుల్లో విజయం సాధించింది. తాజాగా ఆ రికార్డును దీపక్ హుడా బ్రేక్ చేశాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ సైతం అరంగేట్రం చేశాక తాను ఆడిన 13వరుస మ్యాచుల్లో ప్రోటీస్ జట్టు గెలిచింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 38.1 ఓవర్లలోనే 161 పరుగులకు కుప్పకూలింది. అనంతరం లక్ష్యాన్ని భారత్ 25.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. సంజూ శాంసన్ (43నాటౌట్) ధావన్ (33), శుభ్‌మన్ గిల్ (33), దీపక్ హుడా (25) రాణించారు.