దీపక్ చాహర్ కు గాయం.. మిగిలిన వన్డేలకు దూరం
Deepak Chahar Sustains Twisted Ankle.పొట్టి ప్రపంచకప్ ముంగిట భారత్‌ను గాయాల బెడద వీడడం లేదు.
By తోట వంశీ కుమార్ Published on 8 Oct 2022 12:35 PM ISTపొట్టి ప్రపంచకప్ ముంగిట భారత్‌ను గాయాల బెడద వీడడం లేదు. ఇప్పటికే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయాల కారణంగా టీ20 ప్రపంచకప్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రపంచకప్ జట్టుకు స్టాండ్ బైలో ఉన్న దీపక్ చాహర్ సైతం గాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో తొలి వన్డేకు ముందు అతడి చీలమండాలినికి గాయమైంది. దీంతో అతడు మొదటి వన్డేకు దూరంగా ఉన్నాడు.
గాయం తీవ్రమైనది కాదని మేనేజ్‌మెంట్ తెలిపింది. అయితే.. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా మిగిలిన రెండు వన్డేల నుంచి దీపక్ చహర్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు వెల్లడించింది. దీనిపై ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. కాలు బెణికినప్పటికీ పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. కొద్ది రోజులు విశ్రాంత్రి తీసుకుంటే సరిపోతుందనేది మా అభిప్రాయం. టీ20 ప్రపంచకప్ కు దీపక్ చహర్ స్టాండ్ బై ఆటగాడిగా ఉన్నాడు. బుమ్రా స్థానంలో షమీ లేదా చహర్‌లో ఒకరు ఆడే అవకాశం ఉంది. షమీ ఫిట్‌నెస్ నిరూపించుకుంటే చహర్ స్టాండ్ బై ప్లేయర్‌గానే ఉంటాడు. ఒకవేళ షమీ విఫలమైతే దీపక్ కు అవకాశం వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే చహర్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు తెలిపారు.
ప్రపంచకప్ నెట్ బౌలర్లుగా ముకేశ్, సకారియా
ప్రపంచకప్ సందర్భంగా టీమ్ఇండియా ప్రాక్టీస్ కోసమని ఇద్దరు నెట్‌బౌలర్లను ఎంపిక చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చెన్నై తరుపున సత్తా చాటిన ముకేశ్ చౌదరి, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన చేతన్ సకారియా నెట్ బౌలర్లుగా జట్టుతో పాటు ఆస్ట్రేలియా వెళతారు.