తేలిపోయిన బౌలర్లు.. దక్షిణాఫ్రికాదే విజయం.. సిరీస్ సమం
Dean Elgar steers South Africa to victory over India.జోహానెస్‌బర్గ్ వేదికగా టీమ్ఇండియాతో జరిగిన రెండో టెస్టులో
By తోట వంశీ కుమార్ Published on 7 Jan 2022 9:23 AM ISTజోహానెస్‌బర్గ్ వేదికగా టీమ్ఇండియాతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. కఠినమైన పిచ్‌పై భారత పేస్‌ను ఎదురొడ్డుతూ కెప్టెన్ ఎల్గర్ అద్భుతంగా పోరాడడంతో అతిథ్య జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. డీన్ ఎల్గర్(96 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు వాండర్ డసెన్(40), బవుమా(23 నాటౌట్) చక్కని సహకారం అందించడంతో 240 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేదించింది.
నాలుగో రోజు వర్షం కారణంగా తొలి రెండు సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోయింది. దక్షిణాఫ్రికా విజయం సాధించడానికి ఆ జట్టుకు ఆఖరి సెషన్ సరిపోయింది. ఓవర్ స్కోర్ 118/2 తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లు.. భారత బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కెప్టెన్ డీన్ ఎల్గర్ ఇన్నింగ్స్‌కు వెన్నముకలా మారాడు. పేస్, బౌన్స్‌తో భారత పేసర్లు పరీక్షిస్తున్నా.. శరీరానికి బంతులు తాకినా అతడు ఏ మాత్రం ఏకాగ్రత చెదరకుండా బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు.
ఎల్గర్, డసెన్ లు మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు. ఎట్టకేలకు ఈ జోడిని షమీ విడగొట్టాడు. అయితే.. తరువాత వచ్చిన బవుమా పరుగుల ఖాతాను తెరవకముందే ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తన బౌలింగ్‌లోనే బవుమా ఇచ్చిన క్యాచ్‌ను శార్దూల్ వదిలివేయడంతో బతికిపోయిన బవుమా.. తరువాత ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. కెప్టెన్ ఎల్గర్‌తో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఎన్నో అంచనాలున్న బుమ్రా 17 ఓవర్లు వేసి 70 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎల్గర్‌కు దక్కింది. ఇక చివరిదైన మూడో టెస్టు ఈ నెల 11నుంచి కేప్‌టౌన్‌లో జరుగుతుంది.