డేవిడ్ వార్నర్.. ఒకప్పటికీ, ఇప్పటికీ చాలానే మార్పు వచ్చిందని అంటుంటారు. మొదట ఐపీఎల్ లో వార్నర్ జర్నీ ఢిల్లీ డేర్ డెవిల్స్(ఢిల్లీ కేపిటల్స్) ఆటగాడుగా మొదలైన సంగతి తెలిసిందే..! టాలెంట్ ఉన్న ఆటగాడే అయినా ఢిల్లీ జట్టు అతడిని పక్కన పెట్టడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకుంది. ఆ తర్వాత వార్నర్ క్రికెట్ కెరీర్ లో వివాదాలు నడుస్తూ ఉన్నా.. ఐపీఎల్ లో మాత్రం నిలకడగా రాణించాడు. కానీ గత సీజన్ లో సన్ రైజర్స్ కూడా డేవిడ్ వార్నర్ ను పక్కన పెట్టేసింది. అందుకు పలు కారణాలు ఉన్నాయంటూ ప్రచారం కూడా సాగుతోంది.
వీరేందర్ సెహ్వాగ్ కూడా ఒకప్పటి డేవిడ్ వార్నర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2009లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడినప్పుడు జరిగిన సంఘటనల గురించి సెహ్వాగ్ తాజాగా మాట్లాడుతూ.. అప్పట్లో వార్నర్ కు క్రమశిక్షణ అన్నదే లేదన్నాడు. డ్రెస్సింగ్ రూంలో అతడి ప్రవర్తన అస్సలు బాగుండేది కాదన్నాడు. తాను ఇద్దరు ఆటగాళ్లమీద అరిచానని.. అందులో డేవిడ్ వార్నర్ ఒకడని సెహ్వాగ్ చెప్పాడు. జట్టులో కొత్తగా చేరినప్పుడు ప్రాక్టీస్, మ్యాచ్ లకన్నా పార్టీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. తొలి సీజన్ లోనే తోటి ఆటగాళ్లతో ఎప్పుడూ గొడవ పెట్టుకునేవాడని తెలిపాడు. ఆ సీజన్ ఇంకా రెండు మ్యాచ్ లు ఉండగానే అతడిని పంపించేశామని.. ఒక గుణపాఠం నేర్పాలంటే అప్పుడప్పుడు ఇలా బయటకు పంపించేయాల్సి వచ్చిందని సెహ్వాగ్ వివరించాడు. జట్టుకు అతడొక్కడే ముఖ్యం కాదని, ఎంతో మంది ప్రతిభ ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నారని అన్నాడు.