సన్‌రైజర్స్‌కు కొత్త కోచ్ వ‌చ్చేశాడు..!

ఐపీఎల్‌-2024కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాఫ్‌లో పెద్ద మార్పు చేసింది.

By Medi Samrat  Published on  7 Aug 2023 7:15 PM IST
సన్‌రైజర్స్‌కు కొత్త కోచ్ వ‌చ్చేశాడు..!

ఐపీఎల్‌-2024కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాఫ్‌లో పెద్ద మార్పు చేసింది. సన్‌రైజర్స్ యాజ‌మాన్యం ప్రధాన కోచ్ బ్రియాన్ లారాను తొలగించింది. లారా స్థానంలో న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ డేనియల్ వెట్టోరీని హెడ్ కోచ్‌గా నియమించారు. ఐపీఎల్-2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిరాశపరిచింది. గ‌తేడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. మొత్తం సీజన్‌లో జట్టు కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్.. నూత‌న కోచ్‌ డేనియల్ వెట్టోరీ ద్వారా విజ‌యాల బాట ప‌ట్టేందుకు శ్రీకారం చుట్టింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియా ద్వారా ఈ విష‌యాన్ని తెలియజేసింది. బ్రియాన్ లారాతో మా 2 సంవత్సరాల ఒప్పందం ముగిసిందని పోస్ట్‌లో వెల్ల‌డించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మీ సహకారం అందించినందుకు ధన్యవాదాలు. మీ భవిష్యత్ ప్రయత్నాలకు మేము మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని పోస్టులో పేర్కొంది.

డేనియల్ వెట్టోరి గ‌తంలో ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోచ్‌గా ఉన్నాడు. వెట్టోరి ఆస్ట్రేలియా జట్టు అసిస్టెంట్ కోచ్‌గా కూడా బాధ్యతలను నిర్వ‌ర్తించాడు. 2014 నుంచి 2018 వరకు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు డేనియల్ వెట్టోరీ ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. ప్రస్తుతం డేనియల్ వెట్టోరి ది హండ్రెడ్‌లో బర్మింగ్‌హామ్ కోచ్‌గా ఉన్నాడు. డేనియల్ వెట్టోరి IPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు.

Next Story