చెన్నై జట్టుతో జడేజాకు చెడిందా..?
CSK unfollow all-rounder Ravindra Jadeja on Instagram amid rumours of rift.భారీ అంచనాలతో ఇండియన్ ప్రీమియర్ లీగ్
By తోట వంశీ కుమార్ Published on 12 May 2022 4:19 PM ISTభారీ అంచనాలతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడిన చెన్నై 4 మ్యాచుల్లో విజయం సాధించి 8 పాయింట్లతో.. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతుంది. దీంతో ఈ సీజన్‌లో చెన్నై ఫ్లే ఆఫ్స్ చేరుకోవడంతో దాదాపు కష్టమనే చెప్పాలి. మిగిలిన మ్యాచుల్లోనైనా విజయం సాధించాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.
అయితే.. సీఎస్‌కే మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజా గాయం కారణంగా మిగతా మ్యాచులకు దూరం అయిన సంగతి తెలిసిందే. బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ జడ్డూ గాయపడ్డాడని సీఎస్‌కే యాజమాన్యం వివరణ ఇచ్చింది. అయితే.. జడేజాను ఇన్‌స్టాగ్రామ్‌లో సీఎస్‌కే అన్‌ఫాలో చేసిందని, యాజమాన్యం కావాలనే జడేజాను తప్పించి ఉంటుందని అభిమానులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. అప్పట్లో రైనాను సాగనంపినట్లుగానే ఇప్పుడు జడేజాను వెళ్లగొడుతున్నారంటూ మండిపడుతున్నారు.
ఒంటి చేత్తో విజయాలు.. వరుస పరాజయాలు
గత 10 సంవత్సరాలు చెన్నైకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు జడేజా. తన ఆల్‌రౌండర్ ప్రతిభతో ఎన్నో మ్యాచుల్లో జట్టుకు ఒంటి చేత్తో విజయాలను అందించాడు. అందుకనే సీఎస్‌కే ఈ సీజన్‌కు ముందుకు రూ.16కోట్ల వెచ్చించి మరీ అట్టిపెట్టుకుంది. ఇక టోర్నీ ప్రారంభంలో చెన్నై సూపర్ కింగ్స్.. రవీంద్ర జడేజా సారథ్యంలో కొన్ని మ్యాచ్‌లను ఆడిన విషయం తెలిసిందే. టోర్నమెంట్ ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు మహేంద్ర సింగ్ ధోనీకి బదులుగా రవీంద్ర జడేజకు కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చారు. అయితే.. సారథ్య బాధ్యతల కారణంగా తీవ్ర ఒత్తిడికి గురైన జడేజా.. ఈ సీజన్‌లో చెన్నైని సరిగ్గా నడిపించలేకపోయాడు. ఆటగాడిగానూ దారుణంగా విఫలం అయ్యాడు. దీంతో కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. తిరిగి ధోని సారథ్య బాధ్యతలు చేపట్టాడు.
గాయం కారణంగా రవీంద్ర జడేజ- ఈ టోర్నీ నుంచి తప్పుకోవడం మరింత విమర్శలకు కేంద్రబిందువైంది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ మేనేజ్‌మెంట్ ఉద్దేశపూరకంగానే అతన్ని పక్కన పెట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. జడేజ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన కొద్ది సేపటికే అతని అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ను సీఎస్‌కే అన్ ఫాలో చేసినట్లు వార్తలు రావడం ఈ అనుమానాలు, ఆరోపణలకు బలాన్ని కలిగించాయి.
ఈ వ్యవహారం పై చెన్నై సూపర్ కింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన తప్పుపట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే వార్తలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జడేజా భవిష్యత్తులో ఖచ్చితంగా చెన్నైతోనే కొనసాగుతాడని వెల్లడించారు. జడేజా గాయపడ్డాడని, వైద్యుల సూచన మేరకే అతడికి విశ్రాంతి ఇచ్చినట్లు తెలిపారు.