ప్లేఆఫ్స్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్ తగిలింది. ఆల్ రౌండర్ శామ్ కరణ్ వెన్నునొప్పితో బాధపడుతున్న కారణంగా ఐపీఎల్ నుండి వైదొలిగాడు. ఇక ఈ 2021 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడటం లేదు. శనివారం నాడు చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయినప్పుడు వెన్నునొప్పితో బాధపడ్డాడు. అతడికి స్కాన్ చేయడం వల్ల వెన్నులో గాయం బయటపడింది. ఇంగ్లండ్ టీ 20 ప్రపంచకప్ టీమ్ కు కూడా శామ్ కరణ్ దూరమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న అతని సోదరుడు టామ్ కరణ్ ను ట్రావెల్ రిజర్వ్‌గా ఉంచారు.
శామ్ కరణ్ ఐపీఎల్ బయో-బబుల్ నుండి నిష్క్రమించి, రెండు రోజుల్లో మరిన్ని స్కానింగ్‌ల కోసం ఇంగ్లాండ్‌కు వెళ్తాడని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. "అతను రాబోయే రెండు రోజుల్లో తిరిగి యుకె కి వెళ్తాడు. ఈ వారం తరువాత ఈసీబీ వైద్య బృందం మరింత స్కాన్‌లు, పూర్తి సమీక్ష నిర్వహిస్తారు" అని ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. శామ్ కరణ్ ఐపీఎల్ 2021 లో చెన్నై సూపర్ కింగ్స్ కోసం 9 మ్యాచ్‌లు ఆడాడు. 56 పరుగులు చేసి 9 వికెట్లు తీశాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ పాత్ర కోసం వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావోకు ప్రాధాన్యతనివ్వడంతో శామ్ కరణ్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు.