క్రికెట‌ర్ సురేష్ రైనా అరెస్ట్‌

Cricketer Suresh Raina Arrest. టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ సురేష్ రైనా అరెస్ట్ అయ్యాడు. ముంబై పోలీసులు ఆయ‌న్ను అదుపులోకి

By Medi Samrat  Published on  22 Dec 2020 7:37 AM GMT
క్రికెట‌ర్ సురేష్ రైనా అరెస్ట్‌

టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ సురేష్ రైనా అరెస్ట్ అయ్యాడు. ముంబై పోలీసులు ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. రైనాతో పాటు ప్ర‌ముఖ గాయ‌కుడు గురు రంధ్వాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ముంబై డ్రాగన్‌ఫ్లై క్లబ్‌లో జరిగిన దాడిలో రైనాను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రైనాపై కేసు నమోదు చేశారు. అనంత‌రం ఇద్దరినీ బెయిల్‌పై విడుదల చేశారు. ఈ దాడిలో ముంబై క్లబ్‌కు చెందిన ఏడుగురు సిబ్బందితో సహా మొత్తం 34 మందిని అరెస్టు చేసినట్టు సమాచారం.

ఇదిలా ఉండ‌గా.. ఈ ఏడాది ఆగ‌స్టు 15 స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా క్రికెట్ కు రైనా వీడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. త‌న స్నేహితుడు, భార‌త మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోని రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన అర‌గంట వ్య‌వ‌ధిలోనే రైనా వీడ్కోలు ప‌ల‌క‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఇక యూఏఈ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ 2020 సీజ‌న్ నుంచి రైనా అర్థాంత‌రంగా త‌ప్పుకున్నాడు. తొలుత యూఏఈ వెళ్లిన రైనా.. మ‌రో వారం రోజుల్లో టోర్నీ ప్రారంభం అవుతుంద‌న‌గా.. స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చాడు. వ్య‌క్తిగ‌త కారణాల‌తోనే స్వ‌దేశానికి వ‌చ్చిన‌ట్లు రైనా చెప్పినా.. చెన్నై టీమ్ మేనేజ్‌మెంట్‌తో గొడ‌వ జ‌రిగిన‌ట్లు జాతీయ ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు వ‌చ్చాయి.


Next Story