టికెట్ల కోసం క్రికెట్ అభిమానుల ప‌డిగాపులు.. బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని ఆందోళ‌న‌

Cricket fans protest at Gymkhana ground.హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఉప్ప‌ల్ స్టేడియంలో అంత‌ర్జాతీయ మ్యాచ్ జ‌రిగి మూడేళ్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Sep 2022 6:33 AM GMT
టికెట్ల కోసం క్రికెట్ అభిమానుల ప‌డిగాపులు.. బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని ఆందోళ‌న‌

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఉప్ప‌ల్ స్టేడియంలో అంత‌ర్జాతీయ మ్యాచ్ జ‌రిగి మూడేళ్లు కావొస్తుంది. సుదీర్ఘ విరామం త‌రువాత ఈ నెల 25న భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య మూడో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించాల‌ని ఎంతో మంది అభిమానులు ఆరాట ప‌డుతున్నారు. టికెట్లు ద‌క్కించుకునేందుకు తిప్ప‌లు ప‌డుతున్నారు. బుధ‌వారం తెల్ల‌వారు జాము నుంచే ఉప్ప‌ల్‌, జింఖానా గ్రౌండ్స్‌లో క్యూలు క‌ట్టారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు టికెట్ కౌంట‌ర్లు ఓపెన్ చేయ‌క‌పోవ‌డంతో అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌(హెచ్‌సీఏ) వైఖ‌రికి నిర‌స‌న‌గా న‌గ‌రంలోని జింఖానా మైదానం వ‌ద్ద క్రికెట్ ప్రేమికులు ఆందోళ‌న‌కు దిగారు. అస‌లు ఆఫ్‌లైన్‌లో టికెట్లు అమ్ముతారా..? లేదా..? అని ప్ర‌శ్నిస్తున్నారు. బాక్ల్‌లో టికెట్ల విక్ర‌యాల‌ను హెచ్‌సీఏ ప్రోత్స‌హిస్తోంద‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు. టికెట్ల కోసం గ‌త మూడు రోజులుగా తాము జింఖానా మైదానానికి వ‌స్తున్నామ‌ని, అయిన‌ప్ప‌టికీ హెచ్‌సీఏ నుంచి ఎలాంటి స్పంద‌నా లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే న‌గ‌దును రిఫండ్ చేస్తున్నార‌ని అంటున్నారు.

ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం కెపాసిటీ 55 వేలు. కొన్ని టికెట్ల‌ను ఈ నెల 15 నుంచి పేటీఎం ఇన్‌సైడ‌ర్ యాప్‌ను అందుబాటులో ఉంచగా.. అర‌గంట‌లోనే అన్ని టికెట్లు అమ్ముడుపోయాయి. దీంతో అభిమానులు ఆఫ్‌లైన్‌లో టికెట్ల కోసం వేట మొద‌లుపెట్టారు. అయితే.. టికెట్ల‌ను బ్లాక్‌లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నార‌ని ప‌లువురు అభిమానులు ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు జింఖానాకు చేరుకోవ‌డంతో పోలీసులు బందోబ‌స్తును ఏర్పాటు చేశారు.

Next Story