మహిళలకు అనుమతిస్తేనే మగవాళ్లకు కూడా మ్యాచ్ లు..!

Cricket Australia will cancel Afghanistan Test if women excluded from sport. క్రికెట్ ఆస్ట్రేలియా తాలిబాన్లకు ఊహించని షాకిచ్చింది. తాలిబాన్ పాలకులు

By M.S.R  Published on  9 Sep 2021 11:19 AM GMT
మహిళలకు అనుమతిస్తేనే మగవాళ్లకు కూడా మ్యాచ్ లు..!

క్రికెట్ ఆస్ట్రేలియా తాలిబాన్లకు ఊహించని షాకిచ్చింది. తాలిబాన్ పాలకులు మహిళలను క్రికెట్ ఆడటానికి అనుమతించకపోతే ఆఫ్ఘనిస్తాన్ పురుషుల జట్టుతో టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేస్తామని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. ఇటీవల తాలిబాన్ ప్రతినిధి మాట్లాడుతూ.. "మహిళలు క్రికెట్ ఆడటానికి అనుమతించబడుతుందని తాము అనుకోలేదు ఎందుకంటే ఇది అవసరం లేదు. మహిళా ఆటగాళ్లు వారి ముఖం మరియు శరీరాన్ని కనిపించేలా బట్టలు వేసుకోవడం ఇస్లాంకు వ్యతిరేకం" అని చెప్పాడు. దీనిని క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్రంగా తప్పుబట్టింది. న‌వంబ‌ర్ 27వ తేదీన హోబార్ట్‌లో నిజానికి ఆస్ట్రేలియా, ఆఫ్ఘ‌నిస్తాన్ మ‌ధ్య టెస్ట్ మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉంది. తాలిబాన్లు మ‌హిళ‌లు క్రికెట్ ఆడ‌రాదు అంటూ ఆదేశాలు ఇచ్చిన వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా మండి పడింది.

మ‌హిళ‌ల‌కు ఆడే అవ‌కాశం ఇవ్వ‌న‌ప్పుడు ఆఫ్ఘ‌నిస్తాన్ పురుషుల జ‌ట్టుతోనూ టెస్ట్ మ్యాచ్ ఆడాల్సిన అవ‌స‌రం లేద‌ని క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పింది. మ‌హిళా క్రికెట్‌కు ఆద‌ర‌ణ పెర‌గాల‌ని ఆశిస్తున్నామ‌ని క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పింది. అంద‌రికీ ఆట అన్న‌దే త‌మ నినాదం అని, మ‌హిళ‌ల‌ను కూడా స‌మానంగా చూడాల‌ని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. తాలిబాన్లు మ‌హిళా క్రికెట‌ర్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుంటే, అప్పుడు మెన్స్ జ‌ట్టుతో హోబర్ట్‌లో జ‌రిగే మ్యాచ్‌ను ర‌ద్దు చేయాల్సి ఉంటుంద‌ని ఆస్ట్రేలియా చెప్పింది. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల క్రికెట్‌కు మద్దతు ఇవ్వలేదనే మీడియా నివేదికలు నిజమైతే, హోబర్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడం కుదరదని చెబుతూ ప్రకటన విడుదల చేసింది. ఆఫ్ఘనిస్తాన్ 3 సంవత్సరాల క్రితమే ఐసీసీ నుంచి పూర్తి సభ్యత్వ హోదా పొందింది. దీంతో టెస్ట్ క్రికెట్ ఆడేందుకు అనుమతి వచ్చింది.


Next Story