భారత దేశానికి పతకాలు అందించాలని భారత అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్ లో ఎంతగానో పోరాడుతూ ఉన్నారు. ప్రత్యర్థులు మన వాళ్ల కంటే గొప్పగా ఆడడం, అదృష్టం కలిసి రాకపోవడం వంటి వాటి వలన భారత్ పతకాల సంఖ్య పెరగడం లేదు. అయితే పోరాడడంలో మాత్రం భారత ఆటగాళ్లు ఏ మాత్రం వెన్ను చూపించడం లేదు. భారత బాక్సర్ సతీష్ కుమార్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మొహంపై 13 కుట్లు పడ్డా కూడా క్వార్టర్ ఫైనల్స్ ఆడాడు. మ్యాచ్ కు ముందు వైద్యులు క్లియరెన్స్ ఇవ్వడంతో బౌట్ లో అడుగుపెట్టిన సతీష్ కుమార్.. ఏ మాత్రం తడబడకుండా పోరాడాడు.
ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు.. భారత్ కు పతకం అందించవచ్చని అతడు పడ్డ ఆరాటం.. చేసిన పోరాటంకు ప్రశంసలు లభిస్తూ ఉన్నాయి. క్వార్టర్స్ లో సతీశ్ కుమార్ ఓడిపోయాడు. 91 కిలోల హెవీ వెయిట్ విభాగంలో ఉజ్బెకిస్థాన్ కు చెందిన ప్రపంచ చాంపియన్ బఖోదిర్ జలోలోవ్ తో క్వార్టర్స్ లో సతీశ్ తలపడ్డాడు. ప్రి క్వార్టర్ ఫైనల్ లో మొహం, దవడపై గాయాలై 13 కుట్లు పడినా సతీశ్ రింగ్ లోకి దిగాడు. గెలిచేందుకు ప్రయత్నించాడు. కానీ జలోలోవ్ దే పై చేయి అయింది. 0–5 తేడాతో సతీశ్ ఓడిపోయాడు. మూడో రౌండ్ లో ప్రత్యర్థి పంచ్ నుదుటిపై ఉన్న దెబ్బకు తగిలి కుట్లు పిగిలినా ధైర్యంగా నిలుచున్నాడు. అతడి ధైర్యాన్ని చూసి ప్రత్యర్థి జలోలోవ్ కూడా మెచ్చుకున్నాడు. ఇప్పుడు అతడిని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తూ ఉన్నారు.