న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరె అండర్సన్ పెద్ద షాకిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. గత కొంత కాలంగా గాయాలు వేదిస్తుండడం.. మరోవైపు కాబోయే భార్యతో అమెరికాలో స్థిరపడే అవకాశం రావడంతో.. 29 ఏళ్లకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్ (ఎంఎల్‌సీ)లో మాత్రం ఆడనున్నట్టు తెలిపాడు. ఈ టీ20 లీగ్‌తో అండర్సన్ మూడేళ్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున 13 టెస్టులు, 49 వన్డేలు, 31 టి20 మ్యాచ్‌ల్లో పాల్గొన్న అండర్సన్ మొత్తం 2,277 పరుగులు చేశాడు. 90 వికెట్లు తీశాడు.
రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం అండర్సన్ మాట్లాడుతూ.. న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించినందుకు తనకు గర్వంగా ఉందన్నాడు. తనకు కాబోయే భార్య మేరీ మార్గరెట్ తన కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, కష్టకాలంలో అండగా నిలిచిందని తెలిపాడు. స్వస్థలమైన అమెరికా నుంచి న్యూజిలాండ్ వచ్చిందని, తాను గాయాలతో బాధపడినప్పుడు, ఇతర విషయాల్లో మద్దతుగా నిలిచిందని గుర్తు చేసుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాత ఆమెతో కలిసి అమెరికాలో ఉండాలనుకుంటున్నానని, ఆమె కోరిక మేరకు అక్కడి మేజర్ లీగులో ఆడతానని అండర్సన్ తెలిపాడు.
2014 జనవరి 1న విండీస్‌పై అండర్సన్ 36 బంతుల్లో సెంచరీ సాధించి వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు.