చంద్రబాబు ఇచ్చిన దొంగ హామీలు ఇంకా గుర్తున్నాయి : సీఎం జగన్
వైఎస్సార్‌సీపీ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. మంగళగిరిలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది.
By Medi Samrat
వైఎస్సార్‌సీపీ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. మంగళగిరిలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. రాబోయే 45 రోజులు కీలకమని.. 57 నెలల కాలంలో చేసిన మంచిని ప్రతీ ఇంటికి తెలియజేయాలన్నారు. 175 నియోజకవర్గాల నుంచి వచ్చిన 2,500 మంది నేతలతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి 45 రోజులపాటు ఎంతో కీలకమని తెలిపారు. మనం చేసిన మంచి పనులు.. చేసే మంచిని ప్రజలకు చెప్పాలని కోరారు.
రాజకీయాల్లో విశ్వనీయత ముఖ్యం.. చంద్రబాబుకు విశ్వసనీయత లేదన్నారు సీఎం జగన్. 2014లో చంద్రబాబు అది చేస్తాం ఇది చేస్తాం అంటూ హామీలిచ్చారు.. సాధ్యపడని హామీలను కూడా మేనిఫెస్టోలో పెట్టారు, అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు ఇచ్చిన దొంగ హామీలు నాకు ఇంకా గుర్తుందని తెలిపారు వైఎస్ జగన్. రైతు రుణాలు మాఫీ చేస్తానని.. బంగారం లోన్లు తీరుస్తానని చెప్పాడని గుర్తు చేశారు వైఎస్ జగన్.
అసలు అమలు సాధ్యం కాని హామీలు ఎలా ఇచ్చాడో చంద్రబాబుకే తెలియాలి.. ఒక హామీ ఒక నాయకుడు ఇచ్చాడంటే దానికి విశ్వసనీయత ఉండాలి, తప్పుడు హామీలు ఎప్పుడు మనం ఇవ్వలేదు, ఇవ్వం కూడా అని తెలిపారు సీఎం జగన్. మనం ఏది ఇవ్వగలమో.. అది చెబుతున్నాం.. 99 శాతం హామీలన్నింటిని నెరవేర్చామన్నారు. 2019లో మనం అమలు చేయగలిగే హామీలిచ్చాం.. ప్రజలకు గుర్తుండిపోయేలా 2019 మేనిఫెస్టో తెచ్చామన్నారు సీఎం జగన్. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయగలరా? అని అడిగారు.. ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసి తీరతామని ఆనాడు చెప్పానన్నారు వైఎస్ జగన్. ఇది చెప్పాం .. ఇది చేశాం అని ఇంటింటికి వెళ్లి చెప్పగలుగుతున్నామని.. మన పథకాలతో 87 శాతం పైచిలుకు కుటుంబాలకు సంక్షేమం అందించామని చెప్పారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.