మరో సిరీస్ ను సొంతం చేసుకున్న భారత్..!
Clinical India take unassailable 2-0 lead. టీమిండియా మరో సిరీస్ ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ తో రాయ్ పూర్ లో జరిగిన రెండో వన్డేలో
By M.S.R Published on 21 Jan 2023 2:06 PM GMTటీమిండియా మరో సిరీస్ ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ తో రాయ్ పూర్ లో జరిగిన రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్ ను 108 పరుగులకు కుప్పకూల్చిన భారత్.. అనంతరం 20.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (51) అర్ధసెంచరీతో అలరించగా, తొలి వన్డే డబుల్ సెంచరీ హీరో 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. కోహ్లీ 11 పరుగులు చేసి అవుటయ్యాడు. కివీస్ బౌలర్లలో షిప్లే 1, శాంట్నర్ 1 వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్ కు ఏ మాత్రం కలిసిరాలేదు. కివీస్ ఓ దశలో 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. అయితే తొలి వన్డే సెంచరీ హీరో మైకేల్ బ్రేస్వెల్ (22), గ్లెన్ ఫిలిప్స్ (36), మిచెల్ శాంట్నర్ (27) ఆదుకోవడంతో న్యూజిలాండ్ స్కోరు కనీసం 100 అయినా దాటింది. ఫిన్ అలెన్ డకౌట్ కాగా, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 7, హెన్రీ నికోల్స్ 2, డారిల్ మిచెల్ 1, కెప్టెన్ టామ్ లాథమ్ 1, లాకీ ఫెర్గుసన్ 1, బ్లెయిర్ టిక్నర్ 2 పరుగులు చేశారు. హెన్రీ షిప్లే 2 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో షమీ (2), వాషింగ్టన్ సుందర్ (2), హార్దిక్ పాండ్యా (2), కుల్దీప్ యాదవ్ (1), సిరాజ్ (1), శార్దూల్ ఠాకూర్ (1) వికెట్లు తీశారు.
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. ఇక, ఇరుజట్ల మధ్య ఈ నెల 24న మూడో వన్డే జరగనుంది. మూడో వన్డే ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం వేదికగా సాగనుంది. మొహమ్మద్ షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.