సూర్య కుమార్ యాదవ్.. ఎంతో ట్యాలెంట్ ఉన్న ఆటగాడు. ఇప్పటికే ఐపీఎల్ లో తన సత్తా నిరూపించుకున్న సూర్య.. ఇండియన్ జెర్సీ వేసుకొని దుమ్ముదులుపుతూ ఉన్నాడు. ఇంగ్లండ్ తో సిరీస్ లో మూడు మ్యాచ్ లలో చోటు దక్కించుకున్న సూర్య.. రెండు మ్యాచ్ లలో బ్యాటింగ్ ఆడాడు. ఈ రెండు ఇన్నింగ్స్ లలోనూ తనదైన శైలిలో అలరించాడు. నాలుగో టీ 20లో హాఫ్ సెంచరీ బాదగా.. నిర్ణయాత్మకమైన అయిదో టీ20లో ఉన్నంతసేపూ దడ పుట్టించాడు. ఇక ఈ రెండు ఇన్నింగ్స్ లో సూర్య అవుట్ అయిన తీరు మాత్రం అభిమానులకు నిరాశ కలిగించడమే కాకుండా.. ఇంత బ్యాడ్ లక్ నీకే ఎందుకో అని తప్పకుండా అనిపిస్తుంది.
సూర్య కుమార్ యాదవ్ నాలుగో టీ20లో థర్డ్ అంపైర్ తప్పుడు డెసిషన్ తో అవుట్ గా వెనుదిరిగాడు. ఆఖరి టీ20లో క్రిస్ జోర్డాన్ బౌండరీ లైన్ లో చేసిన అద్భుతం కారణంగా అవుట్ అయ్యాడు. ఐదో టీ20లో బౌండరీ లైన్ వద్ద క్రిస్ జోర్డాన్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌కు నిరాశగా వెనుదిరిగాడు. దాదాపు సిక్స్‌గా వెళ్లిన బంతిని ఒంటిచేత్తో అందుకున్న క్రిస్ జోర్డాన్.. చాకచక్యంగా బంతిని సమీపంలోని మరో ఫీల్డర్ జాసన్ రాయ్‌కు అందించాడు. దీంతో రాయ్ నవ్వుతూ క్యాచ్ ను అందుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్ లో ఆదిల్ రషీద్ వేసిన 14వ ఓవర్‌లో రెండో బంతిని గూగ్లీ రూపంలో సంధించగా.. సూర్య డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. లాంగాన్ నుంచి దూసుకొచ్చిన జోర్డాన్ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. అయితే వేగంలో తాను బౌండరీని దాటే ప్రమాదం ఉండటంతో బంతిని పక్కనే ఉన్న జాసన్ రాయ్‌వైపు విసిరాడు. రాయ్ బంతిని అందుకోవడంతో సూర్య వెనుదిరిగాడు.