ఎట్టకేలకు బోణీ కొట్టిన చెన్నై
Chennai Super Kings Register 23 Run Win Over Royal Challengers Bangalore.డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్
By తోట వంశీ కుమార్ Published on 13 April 2022 8:35 AM ISTడిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జూలు విదిల్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో వరుసగా నాలుగు ఓటముల తరువాత ఐదో మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ రాణించి ఈ సీజన్‌లో తొలి విజయాన్ని సాధించింది. బ్యాటింగ్‌లో ఉతప్ప, శివమ్ దూబె చెలరేగగా.. బౌలింగ్‌లో కెప్టెన్ జడేజా, తీక్షణలు బెంగళూరు భరతం పట్టారు. ఫలితంగా 23 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. శివమ్ దూబే (95 నాటౌట్; 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు), రాబిన్ ఊతప్ప ( 88; 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లు) పోటాపోటీగా సిక్సర్ల వర్షం కురిపించారు. అయితే.. చెన్నై ఆరంభం చూస్తే ఆ జట్టు ఇంత స్కోర్ సాధిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. బెంగళూరు బౌలర్ల ధాటికి తొలి ఏడు ఓవర్లలో చెన్నై స్కోర్ 37/2. ఈ దశలో శివమ్ దూబె రాకతో పరిస్థితి మారిపోయింది. అప్పటికే క్రీజులో కుదురుకున్న ఉతప్పతో కలిసి అతడు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇద్దరూ పోటా పోటీగా బౌండరీలు బాదడంతో రాకెట్ వేగంతో చెన్నై స్కోర్ దూసుకువెళ్లింది. వీరిద్దరూ 74 బంతుల్లోనే 165 పరుగులు జోడించారు. ఫలితంగా చెన్నై భారీ స్కోర్ సాధించింది.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు చేసింది. షాబాద్ అహ్మద్(41; 27 బంతుల్లో 4 పోర్లు), సూయాశ్ ప్రభుదేశాయ్ (34; 18 బంతుల్లో 5పోర్లు, 1సిక్స్), దినేశ్ కార్తీక్(34; 14 బంతుల్లో 2 పోర్లు, 3 సిక్సర్లు) రాణించినప్పటికీ ఓటమి తప్పలేదు. కెప్టెన్ డుప్లెసిస్(8), స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(1), సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రావత్(12), విధ్వంసకర వీరుడు మాక్స్‌వెల్(26 11 బంతుల్లో 2పోర్లు, 2 సిక్సర్లు) తక్కువ స్కోర్ కే పెవిలియన్‌కు చేరడంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. చెన్న బౌలర్లలో తీక్షణ నాలుగు, జడేజా మూడు వికెట్లు పడగొట్టారు. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన దూబెకు మ్యాన్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.