దక్షిణాఫ్రికాతో ఆఖరి వన్డే.. పరువు కోసం భారత్ పోరాటం.. భువీ ఔట్, కోహ్లీ డౌట్
Changes in Indian Team for Third ODI against South Africa.టెస్టు, వన్డే సిరీస్‌లను కోల్పోయిన టీమ్ఇండియా కనీసం ఆఖరి
By తోట వంశీ కుమార్ Published on 23 Jan 2022 11:40 AM ISTటెస్టు, వన్డే సిరీస్‌లను కోల్పోయిన టీమ్ఇండియా కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి వైట్‌వాష్ కాకుండా పరువు దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. వన్డే సిరీస్‌లో నేడు(ఆదివారం) కేప్‌టౌన్ వేదికగా నామమాత్రమైన చివరి వన్డేలో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ నాయకత్వ పటిమకు అతి పెద్ద పరీక్ష అనడంలో సందేహం లేదు. రెండు వన్డేల్లో కూడా తన స్థాయికి తగ్గ బ్యాటింగ్ ప్రదర్శన చేయలేకపోగా.. అతడి కెప్టెన్సీ వ్యూహాలు కూడా పూర్తిగా తేలిపోయాయి. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా రుజువు చేసుకోకుండా ఇకపై ఏ ఫార్మాట్‌లోనూ అతను ఈ బాధ్యతలు అందుకునే అవకాశం లేనట్లే.
ఇక మూడో వన్డేలో భారీ మార్పులు చేయాలని టీమ్‌మేనేజ్‌మెంట్ బావిస్తోంది. ముఖ్యంగా రెండు వన్డేల్లో విఫలమైన ఆటగాళ్లపై వేటు పడడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు వన్డేల్లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోగా.. భారీగా పరుగులు ఇచ్చి ఓటమిలో కీలకపాత్ర పోషించిన పేసర్ భువనేశ్వర్ కుమార్‌పై వేటు పడడం ఖాయం. అతడి స్థానంలో దీపక్ చాహర్‌కు అవకాశం ఇవ్వనున్నారు. ఇక యార్కర్ల వీరుడు బుమ్రాకు కూడా విశాంత్రి నిచ్చే అవకాశం ఉంది. అతడికి విశ్రాంతి నిస్తే.. సిరాజ్ జట్టులోకి రానున్నాడు.
అదే విధంగా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతిని ఇచ్చి .. అతడి స్ధానంలో సూర్యకూమార్ యాదవ్ ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక రెండు వన్డేల్లోనూ విఫలం అయిన శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ జట్టులోకి రానున్నాడు. ఇక ఆల్‌రౌండర్ కోటాలో చోటు దక్కించుకున్న వెంకటేశ్ అయ్యర్ తీవ్రంగా నిరాశపరిచినప్పటికీ.. ఫినిషర్‌గా అతడి సేవలు ఉపయోగించుకోవాలని బావిస్తున్న టీమ్‌మేనేజ్‌మెంట్ అతడికి మరిన్ని అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది.