Video : ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ వేడుక జరిగింది.. తెలుసా..?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ వేడుక ఫిబ్రవరి 16న లాహోర్‌లో జరిగింది.

By Medi Samrat  Published on  17 Feb 2025 3:48 PM IST
Video : ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ వేడుక జరిగింది.. తెలుసా..?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ వేడుక ఫిబ్రవరి 16న లాహోర్‌లో జరిగింది. లాహోర్‌లోని దివాన్-ఎ-ఆమ్ ఫోర్ట్‌లో ప్రారంభ వేడుక జరిగింది. దీనికి 2017 ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న పాకిస్థాన్ జట్టు హాజరయ్యింది.

సర్ఫరాజ్ అహ్మద్, మహ్మద్ అమీర్, అజర్ అలీ, జునైద్ ఖాన్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, హసన్ అలీ, మహ్మద్ హఫీజ్, హరీస్ సొహైల్‌లు ఉన్నారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ అతిథులుగా న్యూజిలాండ్ బౌలర్‌ టిమ్ సౌథీ, ద‌క్షిణాఫ్రికా మాజీ ఆట‌గాడు JP డుమిని ఉన్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుక పాకిస్తానీ సంగీత కళాకారులు, బాణసంచా ప్రదర్శనతో ప్రారంభమైంది. అంతకుముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ అందరినీ ఉద్దేశించి ప్రసంగించారు. ఆయ‌న మాట్లాడుతూ.. “ప్రతి క్రికెట్ అభిమాని, మద్దతుదారుడికి నేను హామీ ఇస్తున్నాను.. మేము మాట్లాడుతున్నట్లుగా ఇప్పటికే నాలుగు జట్లు కరాచీకి చేరుకున్నాయి.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జ‌ట్లు రాబోయే 48 గంటల్లో చేరుకుంటాయి. ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని నిర్వహించడం అనేది మా అవిశ్రాంతమైన‌ అంకితభావం, త్యాగంతో కూడిన‌ సుదీర్ఘ ప్రయత్నం. ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించడానికి మేము గడ్డాఫీ, నేషనల్ స్టేడియాలకు అప్‌గ్రేడ్ చేయడం ప్రారంభించాము. కార్మికుల కృషికి ధన్యవాదాలు.. రెండు స్టేడియాలు రికార్డు సమయంలో అత్యాధునిక సౌకర్యాలతో మార్చబడ్డాయని పేర్కొన్నాడు.

సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలో పాకిస్థాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ-2017 టైటిల్‌ను గెలుచుకుంది. ఈసారి కూడా పాక్ జట్టు తన సొంత గడ్డపై ఈ ఘనతను పునరావృతం చేస్తుందని పూర్తి ఆశతో ఉంది.

ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలో సంగీత కార్యక్రమం, లైట్ల ప్రదర్శన, పాకిస్తాన్ సంస్కృతి వరకు ప్రతిదీ కనిపించింది. ఇంతకు ముందు కూడా PCB ప్రారంభ వేడుకలను రెండుసార్లు నిర్వహించింది. తాజాగా లాహోర్‌లో జరిగిన కార్యక్రమం చాలా అద్భుతంగా జ‌రిగింది. ఈ వేడుకకు వందలాది మంది ప్రజలు హాజ‌ర‌య్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. పాకిస్తాన్‌లో జరిగే మ్యాచ్‌లు లాహోర్, రావల్పిండి, కరాచీలలో జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైన‌ల్‌ మ్యాచ్ మార్చి 9న‌ జరగనుంది. ఈ టోర్నీలో 8 జట్ల మధ్య మొత్తం 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే, భారత జట్టుకు హైబ్రిడ్ మోడల్‌ను అమలు చేశారు. భార‌త్‌ తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది.

Next Story