మహిళల టీ20 ఆసియా కప్‌లో సంచ‌ల‌నం.. అత్య‌ధిక సిక్స‌ర్ల‌తో సెంచ‌రీ..!

By Medi Samrat  Published on  22 July 2024 11:26 AM GMT
మహిళల టీ20 ఆసియా కప్‌లో సంచ‌ల‌నం.. అత్య‌ధిక సిక్స‌ర్ల‌తో సెంచ‌రీ..!

మహిళల ఆసియా కప్-టీ20 టోర్నీలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా చమరి ఆట‌ప‌ట్టు చరిత్ర సృష్టించింది. సోమవారం రంగగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ ఈ ఘనత సాధించింది. ఆమె 69 బంతుల్లో 14 ఫోర్లు, ఏడు సిక్సర్ల సహాయంతో 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.

ఇక ఈ మ్యాచ్‌లో చమరి అటపట్టు 7 సిక్సర్లు కొట్టింది. ఇంతకు ముందు ఏ మహిళా క్రీడాకారిణి ఆసియా కప్‌లో ఇన్ని సిక్సర్లు కొట్టలేదు. ఇంతకుముందు ఒక ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 3 సిక్సర్లు మాత్రమే కొట్టారు.

2022 ఆసియా కప్‌లో భారత క్రీడాకారిణి షెఫాలీ వర్మ మలేషియాపై 3 సిక్సర్లు కొట్టింది. 2022 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత క్రీడాకారిణి రిచా ఘోష్ మూడు సిక్సర్లు కొట్టింది. 2022 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌కు చెందిన అలియా రియాజ్ యూఏఈపై మూడు సిక్సర్లు బాదింది. భారత క్రీడాకారిణి స్మృతి మంధాన కూడా 2022లో శ్రీలంకపై మూడు సిక్సర్లు కొట్టింది. వీరంద‌రినీ కాద‌ని చమరి అటపట్టు 7 సిక్సర్లు కొట్టింది. ఈ రికార్డు బ్రేక్ అవ‌డం క‌ష్ట‌మే.

మ్యాచ్ విష‌యానికొస్తే.. చమరి సెంచరీ సాధించగా ఆ జట్టులోని మరే ఇతర బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు. దీంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంత‌రం చేధ‌న‌కు దిగిన మ‌లేషియా జ‌ట్టు 19.5 ఓవ‌ర్ల‌లో అన్ని వికెట్లు కోల్పోయి 40 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

Next Story