శ్రీలంక సంక్షోభం.. పెట్రోల్ కోసం 2 రోజులు క్యూలో క్రికెట‌ర్‌.. ఆవేద‌న

Cannot even go for cricket practice due to fuel crisis says Chamika Karunaratne.శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 July 2022 6:25 AM GMT
శ్రీలంక సంక్షోభం.. పెట్రోల్ కోసం 2 రోజులు క్యూలో క్రికెట‌ర్‌.. ఆవేద‌న

శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఫ‌లితంగా ఆదేశంలో నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటాయి. లీట‌ర్ పెట్రోల్‌, డీజిల్ అయితే రూ.500 మార్క్‌ను ఎప్పుడో దాటేసింది. అయిన‌ప్ప‌టికీ అక్క‌డ ఇంధ‌నం ల‌భించ‌డం లేదు. సామాన్యులే కాక‌ సెల‌బ్రెటీలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజా ప‌రిస్థితుల‌పై లంక క్రికెట‌ర్ చ‌మిక క‌రుణ‌ర‌త్నే తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాడు.

క‌రుణ ర‌త్నె మాట్లాడుతూ ..'కారులో పెట్రోల్ నింపుకోవ‌డం కోసం పెట్రోల్ బంక్ వ‌ద్ద‌కు వ‌చ్చాను. ఇక్క‌డ చాలా పెద్ద క్యూ ఉంది. చేసేది లేక క్యూ లో ఉన్నాను. అదృష్ట వ‌శాత్తు రెండు రోజుల పాటు క్యూలో నిలుచున్న త‌రువాత కారులో ఇంధ‌నం నింపుకున్నాను. ఇంధ‌నం కొర‌త కార‌ణంగా ప్రాక్టీస్‌కు కూడా వెళ్ల‌లేక‌పోతున్నాను. ప్ర‌స్తుతం 10వేల పెట్రోల్ దొరికింది. అయితే.. ఇది రెండు లేదా మూడు రోజులు మాత్రమే వ‌స్తుంది' అని క‌రుణ ర‌త్నె అన్నాడు.

శ్రీలంక ఆసియా క‌ప్‌కు అతిథ్యం ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆసియా క‌ప్‌కు స‌న్న‌ద్దం అయ్యేందుకు కొలంబో స‌హ ప‌లు ప్రాంతాల‌కు వెళ్లి ప్రాక్టీస్ చేయాల్సి ఉందని క‌రుణ ర‌త్నె తెలిపాడు. క్ల‌బ్ గేమ్స్ ఆడాల్సి ఉంది. అయితే పెట్రోల్ కొర‌త కార‌ణంగా ప్రాక్టీస్‌కు ఆటంకం ఏర్ప‌డుతోందని చెప్పాడు. ఆసియా కప్‌కు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ పెద్ద ఈవెంట్ కోసం దేశం తగినంత ఇంధనాన్ని అందిస్తుందని తాను భావిస్తున్న‌ట్లు చెప్పుకొచ్చాడు. అయితే.. ప్ర‌స్తుత దేశ ప‌రిస్థితుల‌పై తాను ఇంత‌క‌న్నా ఎక్కువ మాట్లాడ‌లేన‌ని, అయితే ప‌రిస్థితులు ఇప్పుడు ఏ మాత్రం బాగాలేవ‌ని అన్నాడు.

2019లో శ్రీలంక తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు క‌రుణ ర‌త్నె. ఇప్ప‌టి వ‌ర‌కు లంక త‌రుపున 44 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 18 వ‌న్డేలు, 25టీ20లు, ఓ టెస్టు మ్యాచ్ ఉంది.

Next Story
Share it