చరిత్ర సృష్టిస్తారా..?
Can India chase historic series win in South Africa.దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటి వరకు టీమ్ఇండియా ఏడు సార్లు
By తోట వంశీ కుమార్ Published on 11 Jan 2022 8:56 AM ISTదక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటి వరకు టీమ్ఇండియా ఏడు సార్లు పర్యటించింది. అయితే.. ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ను గెలవలేకపోయింది. ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఊరిస్తూ వస్తున్న దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ విజయాన్ని అందుకునే సువర్ణావకాశం ఇప్పుడు భారత జట్టు చేతుల్లో ఉంది. కేప్‌టౌన్ వేదికగా నేడు(మంగళవారం) ప్రారంభంకానున్న చివరి టెస్టులో గెలిచి చరిత్ర సృష్టించేందుకు భారత జట్టు సిద్దమైంది. కోహ్లీ సారధ్యంలోని టీమ్ఇండియా చరిత్ర సృష్టిస్తుందా..? లేదా డీన్ ఎల్గర్ సేన చేతిలో పరాజయం పాలవుతుందా..? అన్నది చూడాల్సి ఉంది.
వెన్నునొప్పి గాయంతో రెండో టెస్టుకు దూరం అయిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాడు. తన కుమారై తొలి పుట్టిన రోజైన మంగళవారం నాడు 99వ టెస్టు ఆడుతున్న విరాట్ జట్టుకు విజయాన్ని అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు. విరాట్ జట్టులోకి రావడంతో హైదరాబాద్ ఆటగాడు హనుమ విహారి పై వేటు పడుతోంది. గత మ్యాచ్‌లో కీలక సమయంలో రాణించిన సీనియర్ ఆటగాళ్లు రహానే, పుజారాలకు మరో అవకాశం దక్కినట్లే. తొడ కండరాల గాయంతో రెండో టెస్టులో తీవ్రంగా ఇబ్బంది పడిన సిరాజ్ ఈ మ్యాచ్‌లో ఆడడం లేదు. అతడి స్థానంలో ఇషాంత్ శర్మ లేదా ఉమేశ్ యాదవ్‌లలో ఒకరికి అవకాశం దక్కనుంది.
ఇక కీలక సమయంలో ఆదుకోవాల్సింది పోయి.. దూకుడు ఆటతో వికెట్ పారేసుకుంటున్న పంత్ తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెబుతాడో లేదో చూడాలి. పంత్‌ను తప్పించి సాహాను ఆడించాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ పంత్ కీలకం కానుంది. ఓపెనర్లు రాహుల్, మయాంక్ మరోసారి శుభారంభం అందించాల్సి ఉండగా.. పుజారా, రహానే తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. కోహ్లినుంచి కూడా జట్టు మేనేజ్‌మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది.
ఇక రెండో టెస్టులో విజయం సాధించిన జట్టుతోనే దక్షిణాఫ్రికా బరిలోకి దిగే అవకాశం ఉంది. కెప్టెన్, ఓపెనర్ డీన్ ఎల్గర్ ఒక్కడే బ్యాటింగ్ భారాన్ని మోస్తుండగా మరో ఓపెనర్ మార్క్‌రమ్ రాణించాల్సి ఉంది. కీగన్ పీటర్సన్, బవుమా బాగానే ఆడుతున్నప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మార్చాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్‌లో సౌతాఫ్రికాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. రబాడ, ఎంగిడి, అవివీర్, జాన్సన్‌తో కూడిన పేస్ విభాగం చాలా పటిష్టంగా కనిపిస్తోంది.