ఆందోళ‌న‌లో అభిమానులు.. గాయంతో మైదానం వీడిన జస్‌ప్రీత్ బుమ్రా

Bumrah leaves field after sustaining ankle sprain.సెంచూరియ‌న్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Dec 2021 6:29 PM IST
ఆందోళ‌న‌లో అభిమానులు.. గాయంతో మైదానం వీడిన జస్‌ప్రీత్ బుమ్రా

సెంచూరియ‌న్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. స్టార్ పేస‌ర్ బుమ్రా గాయంతో మైదానాన్ని వీడాడు. సౌతాఫిక్రా ఇన్నింగ్స్ 11వ ఓవ‌ర్‌లో బంతిని అందుకున్న బుమ్రా తొలి నాలుగు బంతుల‌కు క‌ట్టుదిట్టంగా వేశాడు. ఇక ఐదో బంతిని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ గా బంతిని వేసిన త‌రువా ఫాలోత్రూ స‌మ‌యంలో బుమ్రా పాదం మెలిక‌ప‌డింది. నొప్పితో విల‌విల‌లాడిన బుమ్రా మైదానంలోనే కుప్ప‌కూలిపోయాడు. వెంట‌నే భార‌త జ‌ట్టు ఫిజియో నితిన్ ప‌టేల్ మైదానంలోకి వ‌చ్చి బుమ్రా గాయాన్ని ప‌రిశీలించారు. గాయం తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌డంతో బుమ్రాను మైదానంలోంచి బ‌య‌ట‌కు తీసుకువెళ్లాడు. ఆ ఓవ‌ర్‌లో మిగిలిన ఒక్క బంతిని సిరాజ్ వేశాడు.

ఇక డ్రెస్సింగ్ రూమ్‌లో కాలికి బ్యాండేజ్‌తో బుమ్రా క‌నిపించాడు. గాయం తీవ్ర‌తపై ఇప్ప‌టి వ‌ర‌కు స్ప‌ష్ట‌త లేదు. బుమ్రా పాదానికి స్కానింగ్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఆ త‌రువాత మాత్ర‌మే దానిపై ఓ క్లారిటీ రానుంది. ఒక‌వేళ బుమ్రాకు అయిన గాయం తీవ్ర‌మైన‌ది అయితే సౌతాఫ్రికా పర్యటన నుంచి బుమ్రా తప్పుకుంటాడు. ప్ర‌స్తుత మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గ‌ర్ వికెట్ తీసి మంచి ల‌య‌లో క‌నిపిస్తున్న బుమ్రా దూరం కావ‌డం నిజంగా భార‌త్‌కు పెద్ద దెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు.

బుమ్రా సేవలను కోల్పోయినా పేసర్లు మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. షమీ రెండు కీలక వికెట్లు తీయ‌గా సిరాజ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. భారత బౌలర్ల ధాటికి 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ద‌క్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే.. క్వింట‌న్ డికాక్‌(33), టెంబా బ‌వుమా(31) జ‌ట్టును ఆదుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌స్తుతం సౌతాఫ్రికా స్కోర్ 103/4. వీరిద్ద‌రూ అభేద్య‌మైన ఐదో వికెట్‌కు 72 ప‌రుగులు జోడించారు. వీరిద్ద‌రిని ఎంత త్వ‌ర‌గా పెవిలియ‌న్‌కు చేర్చితే భార‌త్ కు అంత లాభం.

అంతక ముందు టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 327 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. భార‌త బ్యాట్స్‌మెన్ల‌లో లోకేష్ రాహుల్ 123, మ‌యాంక్ అగ‌ర్వాల్ 60, ర‌హానే 48, కోహ్లీ 35 ప‌రుగుల‌తో రాణించారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో లుంగి ఎంగిడి 6 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, ర‌బాడా 3 వికెట్లు, మార్కో జాన్సెన్ ఒక్క వికెట్ తీశారు.

Next Story