చెన్నై పిచ్ లపై తీవ్ర విమర్శలు..!
Brett Lee, Ben Stokes slam Chennai pitch. చెన్నైలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లపై తీవ్ర విమర్శలు ఎదురవుతూ ఉన్నాయి.
By Medi Samrat
చెన్నైలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లపై తీవ్ర విమర్శలు ఎదురవుతూ ఉన్నాయి. మరీ దారుణంగా తయారయ్యాయని మాజీ క్రికెటర్లు కూడా చెబుతున్నారు. ఇంగ్లండ్ ఆల్ రౌండర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు బెన్ స్టోక్స్ చెన్నై పిచ్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. చెన్నై పిచ్ లు పరమ చెత్తగా ఉన్నాయని.. ఐపీఎల్ ఆడుతున్న జట్లు పిచ్ కారణంగా తక్కువ స్కోర్లకే పరిమితం కావడం దురదృష్టకరమని అన్నాడు. ఐపీఎల్ కీలక దశకు చేరుకున్న తరుణంలో టోర్నమెంటు దారుణంగా మారకూడదని చెప్పాడు. 160 నుంచి 170 పరుగులు నమోదు కావాల్సిన మ్యాచుల్లో కూడా కేవలం 130 నుంచి 140 రన్స్ మాత్రమే నమోదవుతున్నాయని స్టోక్స్ తెలిపాడు. ఇప్పటి వరకు చెన్నైలో జరిగిన మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు మాత్రమే కేవలం రెండు సార్లు మాత్రమే 170కి మించి పరుగులు చేశాయని స్టోక్స్ చెప్పాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ కూడా ఇదే వాదనను వినిపించాడు. చిన్న చిన్న స్కోర్లు నమోదు చేయడమే ఇక్కడ కష్టమైపోతుందని.. ఈ తరహా పిచ్‌ల వల్ల ఉపయోగం లేదన్నాడు. కనీసం బోర్డుపై 150 నుంచి 160 పరుగులు చేయలేని పిచ్‌లు ఎందుకని ప్రశ్నించాడు. ఇక్కడ గ్రౌండ్స్‌మెన్‌కు పిచ్‌లు తయారుచేయడానికి సమయం దొరక్కపోవడం బాధాకరమన్నాడు. ప్రత్యామ్నాయ రోజుల్లో కూడా గ్రౌండ్స్‌మెన్‌కు పిచ్‌ను తయారు చేసే అవకాశమే లేదన్నాడు. ముంబై నిర్దేశించిన 132 పరుగులు చేసేటప్పుడు కూడా పంజాబ్ కింగ్స్ క్యాంప్‌లో కాస్త ఆందోళన కనబడిందన్నాడు.. మధ్య ఓవర్లలో ఈ పిచ్ దారుణంగా మారిపోతుందని.. అటు తొలుత బ్యాటింగ్‌కు అనుకూలించక, ఇటు ఛేజింగ్‌కు అనుకూలించని పిచ్‌లు వల్ల ఉపయోగం లేదన్నాడు.