Video : కీల‌క మ్యాచ్‌లో 'భారీ పొరపాటు' చేసిన పాకిస్థానీ ఆటగాడు..!

పాక్‌ బ్యాట్స్‌మెన్ మొహమ్మద్ హారిస్ పొరపాటు చేసినప్పటికీ, పాకిస్తాన్ బంగ్లాదేశ్‌ను 11 పరుగుల తేడాతో ఓడించి, ఆసియా కప్ 2025లో ఫైనల్‌లో చోటు దక్కించుకుంది.

By -  Medi Samrat
Published on : 26 Sept 2025 2:59 PM IST

Video : కీల‌క మ్యాచ్‌లో భారీ పొరపాటు చేసిన పాకిస్థానీ ఆటగాడు..!

పాక్‌ బ్యాట్స్‌మెన్ మొహమ్మద్ హారిస్ పొరపాటు చేసినప్పటికీ, పాకిస్తాన్ బంగ్లాదేశ్‌ను 11 పరుగుల తేడాతో ఓడించి, ఆసియా కప్ 2025లో ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. హారిస్ చేసిన తప్పిదం కార‌ణంగా పాకిస్తాన్‌ ఒక సవాలుతో కూడిన మ్యాచ్‌లో ఒక విలువైన‌ పరుగు కోల్పోయింది.

సూపర్-4 రౌండ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. తర్వాత షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ (తలా మూడు వికెట్లు) బంగ్లాదేశ్‌ను 124/9 స్కోరుకు పరిమితం చేశారు.

పాకిస్థాన్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ చివరి బంతికి మహ్మద్ హారిస్ తప్పిదం చేశాడు. కెప్టెన్ సల్మాన్ అలీ అగాతో కలిసి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హారిస్ మొదటి పరుగు పూర్తి చేయకుండా రెండో పరుగు తీయ‌డానికి పరుగెత్తాడు. దీంతో అంపైర్ రెండు పరుగులకు బదులు ఒక్క పరుగు మాత్రమే ఇవ్వ‌డంతో పాక్ ఖాతాలో ఒకే ప‌రుగు చేరింది.

మెహదీ హసన్ బౌలింగ్‌లో సల్మాన్ లాంగ్ వైపు షాట్ ఆడాడు. బ్యాట్స్‌మెన్ తొలి పరుగు పూర్తి చేశారు. సల్మాన్ రెండో పరుగు కోసం పిలిచాడు, కానీ హారిస్ మొదట నిరాకరించాడు. రిషద్ హుస్సేన్ చేతి నుంచి బంతి జారిపోవడంతో బ్యాట్స్‌మెన్ రెండో పరుగు కోసం వెళ్లారు. హారిస్ తన బ్యాట్‌ను క్రీజులో ఉంచని కారణంగా మొదటి పరుగును పూర్తి చేయలేదని రీప్లేలు చూపించాయి.

బ్యాటింగ్ తర్వాత బౌలింగ్‌లోనూ పాకిస్థాన్ న‌వ్వుల పాల‌య్యింది. మరో ఆటగాడు బ్యాకప్ ఇవ్వకపోవడంతో సైఫ్ హసన్ రన్ అవుట్‌ను సామ్ అయూబ్ కోల్పోయాడు. చాలా తప్పిదాలు చేసినా పాక్ జట్టు మ్యాచ్‌లో విజయం సాధించింది.

ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్ జట్టు చిరకాల ప్రత్యర్థి భారత్‌తో తలపడనుంది. 41 ఏళ్ల ఆసియా కప్‌ చరిత్రలో భారత్‌, పాకిస్థాన్‌లు ఫైనల్‌లో తలపడడం ఇదే తొలిసారి. మరోవైపు, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో లీగ్ మరియు సూపర్-4 రౌండ్లలో భారత జట్టు పాకిస్థాన్‌ను ఓడించింది.

Next Story