ఆస్ట్రేలియాలో బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్న క్రికెట‌ర్‌.. బీసీసీఐ కీలక నిర్ణయం

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో రెండవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో అభిమానులు భారత జట్టు ఆటగాళ్లతో అనుచితంగా ప్రవర్తించారు.

By Medi Samrat  Published on  4 Dec 2024 1:30 PM GMT
ఆస్ట్రేలియాలో బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్న క్రికెట‌ర్‌.. బీసీసీఐ కీలక నిర్ణయం

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో రెండవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో అభిమానులు భారత జట్టు ఆటగాళ్లతో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో ఇకపై ఓపెన్ ప్రాక్టీస్ సెష‌న్‌లో పాల్గొన‌కూడ‌ద‌ని బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంది. ఆట‌గాళ్లు బాడీ షేమింగ్‌ను ఎదుర్కోవలసి వచ్చింది.

అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ పింక్‌ బంతితో ఆడనుంది. ఇందుకోసం భారత జట్టు చెమటోడ్చుతోంది. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా పాల్గొంది. ప్రాక్టీస్ సెషన్‌కు అభిమానులను కూడా అనుమ‌తించింది స్టేడియం సిబ్బంది. ఆస్ట్రేలియా ఆట‌గాళ్ల‌ను చూసేందుకు కొద్దిమంది అభిమానులు గుమిగూడగా.. భారత జట్టును ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. సుమారు 5,000 మంది అభిమానులు స్టేడియానికి వ‌చ్చారు. వారిలో కొందరు కించపరిచే వ్యాఖ్యలు చేసారు. దీంతో BCCI మిగిలిన ఆస్ట్రేలియన్ టూర్‌లో క్లోజ్డ్ డోర్ ప్రాక్టీస్ సెషన్‌లతో ముందుకు సాగాలని నిర్ణయించుకుంది.

అడిలైడ్‌లోని ప్రాక్టీస్ ఫెసిలిటీ స్టాండ్‌లు నెట్‌కు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ సమయంలో స్టాండ్‌లో కూర్చున్న అభిమానులు ఆటగాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అభిమానులు భారత ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఓ భారత ఆటగాడు బాడీ షేమింగ్‌కు కూడా గురయ్యాడు.

అక్కడ పూర్తి గందరగోళం నెలకొందని బిసిసిఐ సీనియర్ అధికారి ఒకరు పిటిఐకి తెలిపారు. ఆస్ట్రేలియా శిక్షణ సమయంలో 70 మంది కంటే ఎక్కువ మంది రాలేదు.. కానీ భారత్‌ సెషన్‌లో 3000 మంది వచ్చారు. ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారని ఎవరూ ఊహించలేదు.

రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లను సిక్సర్లు కొట్టమని అభిమానులు ప్రోత్సహించారని.. ఇతర ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై వ్యాఖ్యానించారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఇది కాకుండా.. విరాట్, శుభ్‌మన్ గిల్‌లను ఫ్యాన్స్‌ చుట్టుముట్టారు. వారు మైదానంలోకి వ‌చ్చే ముందు కొంతమంది తమ స్నేహితులతో ఫేస్‌బుక్ లైవ్ చేస్తూ బిగ్గరగా అరుస్తున్నారు. ఒక మద్దతుదారుడు గుజరాతీలో 'హాయ్' చెప్పమని ఆటగాడిని.. చాలాసార్లు అభ్యర్థించాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపాడు. మరో క్రికెటర్ 'బాడీ షేమింగ్' ఎదుర్కొన్నాడని తెలిపాడు.

అడిలైడ్‌లో జరగబోయేది మ్యాచ్ డే-నైట్ టెస్ట్ కాగా.. దీని తర్వాత బ్రిస్బేన్, మెల్‌బోర్న్, సిడ్నీలలో పగటిపూట మ్యాచ్‌లు జరుగుతాయి.

Next Story