ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఇంట్లో విషాదం నెలకొంది. బెన్‌స్టోక్స్ తండ్రి గెరార్డ్ జేమ్స్ స్టోక్స్ అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. మాజీ రగ్బీ ఆటగాడైన జెడ్ జనవరిలో బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడ్డాడు. అప్పటి నుంచి కోలుకునేందుకు అత్యుత్తమ వైద్య సౌకర్యాలు కల్పించినా.. ఫలితం లేకుండా పోయింది. గెరార్డ్ స్టోక్స్ మాజీ క్లబ్ వర్కింగ్ టౌన్ ఆయన మరణాన్ని ధృవీకరిస్తూ సంతాపం తెలిపింది. 'మా మాజీ ఆటగాడు, కోచ్ గెరార్డ్ స్టోక్స్ ఇక లేరనే వార్త మమ్మల్ని తీవ్రంగా బాధిస్తోంది. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు మా సంతాపాన్ని తెలియజేస్తున్నాం'అని ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రతీ మ్యాచ్‌లో వికెట్లు తీసినా, సెంచరీ చేసినా చేతులతో తండ్రికి అభివాదం చేసేవాడు బెన్‌స్టోక్స్. తన తండ్రి అనారోగ్యం కారణంగా పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్ మధ్యలో న్యూజిలాండ్‌కు తిరిగి వచ్చేసిన స్టోక్స్ దగ్గరుండి బాగోగులు చూసుకున్నాడు. ఈ కారణంగానే ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడు. ఇదిలా ఉంటే పర్యటనలో భాగంగా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న స్టోక్స్..తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన స్వదేశానికి బయల్దేరాడు. 'తండ్రిని కోల్పోయి తీవ్ర బాధలో ఉన్న స్టోక్స్‌కు అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి' అంటూ ఈసీబీ తమ అధికారిక ట్విట్టర్‌లో పేర్కొంది.