Rohit Sharma - Virat Kohli : వన్డే జట్టులో కొనసాగాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే..!
దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టమైన సందేశం ఇచ్చింది.
By - Medi Samrat |
దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టమైన సందేశం ఇచ్చింది. వన్డే జట్టులో కొనసాగాలంటే దేశవాళీ వన్డే టోర్నీల్లో పాల్గొనాల్సి ఉంటుందని బోర్డు వారిద్దరికీ తెలిపింది. ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటికే టెస్ట్, T20 అంతర్జాతీయ ఫార్మాట్‌ల నుండి రిటైర్ అయ్యారు. ODI జట్టులో మాత్రమే కొనసాగుతున్నారు. అటువంటి పరిస్థితిలో వారు దేశవాళీ క్రికెట్ ద్వారా తమ మ్యాచ్ ఫిట్‌నెస్, ఫామ్‌ను కొనసాగించాలని బోర్డు, టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటున్నారు.
వర్గాల సమాచారం ప్రకారం.. విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు తాను అందుబాటులో ఉంటానని రోహిత్ శర్మ ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు తెలిపాడు. ఈ మ్యాచ్ డిసెంబర్ 24న జరగనుంది. అదే సమయంలో విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండే విషయం గురించి స్పష్టత లేదు.
డిసెంబరు 3 నుండి 9 వరకు దక్షిణాఫ్రికాతో మూడు ODIలు, జనవరి 11 నుండి న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌లో భారత్ తదుపరి ఆడాల్సివుంది. ఈ రెండు సిరీస్‌ల మధ్య దేశవాళీ ODI టోర్నమెంట్‌కు ఒక రోజు మాత్రమే ఉంది. అందుకే సీనియర్ ఆటగాళ్లు ఇద్దరూ దేశీయ మ్యాచ్‌లు ఆడేందుకు ఈ విండోను ఉపయోగించాలని BCCI కోరుతోంది.
2024 ప్రపంచకప్ తర్వాత ఇద్దరు దిగ్గజాలు టీ20 ఇంటర్నేషనల్, టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. ఇప్పుడు వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. వీరిద్దరూ గత నెలలో ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ ఆడారు. ఇద్దరు కలిసి మూడో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
BCCI అధికారి ఒకరు మాట్లాడుతూ.. 'ఇద్దరు ఆటగాళ్లు ఇప్పుడు రెండు ఫార్మాట్‌ల నుండి రిటైర్ అయినందున, వారు మ్యాచ్-ఫిట్‌గా ఉండటానికి దేశవాళీ క్రికెట్ ఆడవలసి ఉంటుందని చెప్పారు'.
రోహిత్ ఇటీవల ముంబైలోని శరద్ పవార్ ఇండోర్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. నవంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా అతడు పాల్గొనవచ్చని వార్తలు వచ్చాయి.
అదే సమయంలో విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. అతన్ని త్వరలో దేశవాళీ క్రికెట్‌లో చూడాలని బోర్డు కోరుకుంటుంది.
సెలక్షన్ కమిటీ విధానం స్పష్టంగా ఉంది. ఆటగాళ్లు అందుబాటులో ఉన్నప్పుడల్లా దేశవాళీ క్రికెట్ ఆడాలని ఛైర్మన్ అజిత్ అగార్కర్ ఇప్పటికే అన్నారు. ఇది వారి రిథమ్, ఫిట్‌నెస్‌ను కాపాడుతుందన్నారు.