కోహ్లీ కెప్టెన్సీపై అనిశ్చితి.. రోహిత్ శర్మకే వ‌న్డే పగ్గాలు..?

BCCI wants Virat Kohli to focus on batting.టీ20 ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం ఆ ఫార్మాట్‌ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Nov 2021 4:08 AM GMT
కోహ్లీ కెప్టెన్సీపై అనిశ్చితి.. రోహిత్ శర్మకే వ‌న్డే పగ్గాలు..?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం ఆ ఫార్మాట్‌ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు విరాట్ కోహ్లీ టోర్నీ ఆరంభానికి ముందే చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇక న‌వంబ‌ర్ 17 నుంచి న్యూజిలాండ్‌తో భార‌త జ‌ట్టు మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడ‌నుంది. ఈ నేప‌థ్యంలో కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌కు బీసీసీఐ(భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు) అప్ప‌గించింది. ఇక వ‌న్డేలు,టెస్టుల్లో విరాట్ కెప్టెన్సీకి ఎటువంటి ముప్పులేద‌ని అంద‌రూ బావించారు. అయితే.. బీసీసీఐ మాత్రం వ‌న్డే కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీని త‌ప్పించాల‌ని బావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆ బాధ్య‌త‌ల‌ను కూడా రోహిత్ శ‌ర్మ‌కు అప్ప‌గించ‌నున్న‌ట్లు స‌మాచారం.

విరాట్ కోహ్లీ పై కెప్టెన్సీ భారాన్ని త‌గ్గించేందుకు ఈ నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ భారం త‌గ్గితే.. కోహ్లీ త‌న బ్యాటింగ్‌పై మ‌రింత దృష్టిపెట్టేందుకు అవ‌కాశం ఉంటుంది. గ‌త కొద్ది రోజులుగా విరాట్.. ప‌ని ఒత్తిడి కార‌ణంగా ఇబ్బంది ప‌డుతున్నాడు. దీని ప్ర‌భావం అత‌డి బ్యాటింగ్‌పై కూడా ప‌డింది. కోహ్లీ సెంచ‌రీ చేసి చాలా రోజులు అయ్యింది. ఒక‌ప్పుడు ప‌రుగుల రారాజుగా కీర్తి గ‌డించిన కోహ్లీ.. మున‌ప‌టిలా ప‌రుగుల వ‌ర‌ద పారించ‌డం లేదు. మూడు ఫార్మాట్లలోనూ జట్టు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తుండడం అతడి ఆటతీరుపై ప్రభావం చూపుతోందని ప‌లువురు విశ్లేషకులు చెబుతున్నారు. స్వ‌యంగా కోహ్లీ కూడా అదే అభిప్రాయంతో ఉన్నాడు. అందుకే ఆటపై మరింత దృష్టి పెట్టేందుకు వీలుగా టీ20 కెప్టెన్సీని వదులుకున్నాడు.

వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో ద‌క్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందే కోహ్లీని వ‌న్డే కెప్టెన్సీ నుంచి వైదొల‌గాల‌ని బీసీసీఐ కోర‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌ను.. వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ను ఎంపిక చేసే అవ‌కాశం ఉంది. కోహ్లీని వ‌న్డే కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌డానికి మ‌రో కారణం కూడా ఉంద‌ట‌. వ‌చ్చే రెండేళ్ల‌లో రెండు ప్ర‌పంచ‌క‌ప్‌లు ఉన్నాయి. 2022లో ఆస్ట్రేలియా వేదిక‌గా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌రుగ‌నుండ‌గా.. 2023లో భార‌త్ వేదిక‌గా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నుంది. దీంతో రెండు ఫార్మాట్ల‌కు కూడా ఒకే కెప్టెన్ ఉంటే మంచిద‌నే అభిప్రాయంలో బీసీసీఐ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Next Story