ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్, బీసీసీఐ సెక్రటరీ జైషా ఆసియా కప్ కోసం భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించబోదని చెప్పారు. అలాగే ఈ టోర్నమెంట్ పాకిస్తాన్ వెలుపల ఉన్న ఇతర దేశాలకు మార్చనున్నట్లు చెప్పడంతో.. పాక్ మాజీ క్రికెటర్లు, పీసీబీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆసియా కప్2023కు భారత్ జట్టును పంపకపోతే, తదుపరి వన్డే ప్రపంచకప్‌కు మా జట్టును భారత్‌కు పంపబోమని పీసీబీ బెదిరిస్తోంది. జులై-ఆగస్టులో ఆసియా కప్, అక్టోబర్-నవంబర్‌లో ప్రపంచకప్ జరగాల్సి ఉంది. వచ్చే నెలలో మెల్‌బోర్న్‌లో జరగనున్న ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్లు పీసీబీ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే భారత్ ను బెదిరించి పాక్ క్రికెట్ బోర్డు ఏమీ చేయలేదని అందరికీ తెలిసిందే..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులలో 10% మంది పాకిస్తాన్‌లో నివసిస్తున్నారు. భారత్ వాటా దాదాపు 60%గా ఉంది. క్రికెట్ ఫైనాన్స్ విషయానికి వస్తే, ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆదాయానికి భారతదేశం 80% సహకరిస్తుంది. పాకిస్తాన్ 5% మాత్రమే అందిస్తోంది. పాకిస్థాన్ ప్రపంచకప్ ఆడకపోయినా.. టోర్నీ ఆర్థిక పరిస్థితికి ఎలాంటి తేడా ఉండదు. బీసీసీఐ పాకిస్థాన్ బోర్డు కంటే 36 రెట్లు సంపన్నమైనది. బీసీసీఐ విలువ 15,521 కోట్లుగా ఉంది. అదే సమయంలో పీసీబీ విలువ రూ.427 కోట్లు మాత్రమే. ఇక మ్యాచ్ లు ఎక్కడ జరిగినా భారత అభిమానులు ఎంత టికెట్ రేటు పెట్టైనా వెళుతూ ఉంటారు. ఇలాంటి బెదిరింపులు పాక్ కే నష్టం తప్ప.. భారత్ కు ఎలాంటి నష్టం ఉండదు.