ఎక్కువ పరుగులు చేసిన వారిని ఎందుకు పట్టించుకోవడం లేదు.. బీసీసీఐపై హర్భజన్ ఫైర్..!
ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో అనుభవజ్ఞుడైన విదర్భ బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
By Medi Samrat Published on 15 Jan 2025 9:18 PM ISTప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో అనుభవజ్ఞుడైన విదర్భ బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడు భారత క్రికెట్ జట్టులోకి తిరిగి రావడానికి మార్గం కోసం చూస్తున్నాడు. అతని ఆటతీరు చూసి అభిమానులు, క్రికెట్ నిపుణులు బీసీసీఐపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు ఇంగ్లండ్‌పై ఆడబోయే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టుపై బీసీసీఐపై హర్భజన్ సింగ్ విమర్శలు చేశాడు.
హర్భజన్ సింగ్ ఇటీవల నాయర్ అద్భుతమైన ప్రదర్శనలు ఉన్నప్పటికీ సెలెక్టర్లు పట్టించుకోలేదని సుదీర్ఘంగా మాట్లాడాడు. భారత్ తరపున రెండవ ట్రిపుల్ సెంచరీ చేసిన నాయర్‌ను జట్టు నుండి మూడు మ్యాచ్‌ల తర్వాత తొలగించారని అప్పటి సెలెక్టర్లపై హర్భజన్ సింగ్ ఆరోపణలు చేశారు.
హర్భజన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో.. నేను కరుణ్ నాయర్ గణాంకాలను చూస్తున్నాను. 2024/25లో అతను ఆరు ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐదింటిలో నాటౌట్‌గా ఉన్నాడు. 664 పరుగులు చేశాడు. అతని సగటు అద్భుతంగా ఉంది. అతడు 120 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. అయినా కరుణ్ నాయర్‌ను ఎంపిక చేయలేదు. ఇది తగదు. చాలా మంది ఆటగాళ్లను కేవలం రెండు మ్యాచ్‌ల ఆధారంగా ఎంపిక చేస్తారు. కొంతమందిని ఐపీఎల్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. వారికి నిబంధనలు ఎందుకు భిన్నంగా ఉంటాయి? రోహిత్, విరాట్ ఫామ్‌లో లేరని.. రంజీల్లోకి పంపిస్తారని అంటున్నారు. అయితే రంజీలు ఆడుతూ పరుగులు చేసిన వారిని.. ఎందుకు పట్టించుకోవడం లేదు. కరుణ్ పరుగులు చేస్తున్నాడు.. ఈ ఆటగాళ్లు ఎప్పుడు జాతీయ జట్టుకు ఆడతాడు.? అంటూ ప్రశ్నించాడు.
ప్రస్తుతం గురువారం జరిగే విజయ్ హజారే రెండో సెమీ ఫైనల్‌లో విదర్భ.. మహారాష్ట్రతో తలపడనుంది. కరుణ్ నాయర్ మరోసారి యాక్షన్‌లో కనిపించనున్నాడు.