బీసీసీఐ సంచలన నిర్ణయం.. సెలక్షన్ కమిటీపై వేటు
BCCI Scraps Selection Committee Led By Chetan Sharma. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు
By తోట వంశీ కుమార్ Published on 19 Nov 2022 10:11 AM ISTఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా సెమీస్‌లో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్(బీసీసీఐ) మొత్తం ప్రక్షాళనకు సిద్దమైనట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా తొలుత ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై వేటు వేసింది. ప్రస్తుత కమిటీలో ఛైర్మన్‌గా చేతన్ శర్మ ఉండగా.. సునీల్‌జోషీ(సౌత్‌జోన్), హర్విందర్ సింగ్(సెంట్రల్ జోన్), దెబాషిశ్ మొహంతి(ఈస్ట్ జోన్) సభ్యులుగా ఉన్నారు. ఈసారే కాకుండా, గతేడాది టీ20 ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసింది ఈ బృందమే కావడం గమనార్హం.
అంతే కాదు కొత్త కమిటీ ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నిర్ణయం తీసుకుంది. సీనియర్ పురుషుల జట్టును ఎంపిక చేసేందుకు ఐదుగురు సెలక్టర్లు కావాలంటూ బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే వారికి.. కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు కానీ, కనీసం 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు కానీ, లేక 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన అనుభవం ఉండాలని పేర్కొంది. అంతేకాకుండా ఆటకు వీడ్కోలు పలికి ఐదేళ్లు అయి ఉండాలనే నిబంధనను విధించింది. మరే ఇతర క్రికెట్ కమిటీల్లో సభ్యులై ఉండరాదని చెప్పింది. నవంబర్ 28 సాయంత్రం 6 గంటల వరకు లోపు దరఖాస్తులు సమర్పించవచ్చునని స్పష్టం చేసింది.
🚨NEWS🚨: BCCI invites applications for the position of National Selectors (Senior Men).
— BCCI (@BCCI) November 18, 2022
Details : https://t.co/inkWOSoMt9
ఇక జట్టులోనూ పెను మార్పులు ఉండనున్నాయనే సంకేతాలు ఇచ్చింది. ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్‌ను నియమించే బాధ్యత కొత్త ఛైర్మన్‌దేనని తెలిపింది. దీంతో టెస్టులు, వన్డేలు, టీ20లకు వేర్వేరు సారథులు ఉండనున్నారు.