బుమ్రా, సిరాజ్‌ల‌ వారసులకై వేట.. అక్క‌డ మెరిసిన‌ శ్రేయాస్ అయ్యర్..!

దులీప్ ట్రోఫీతో ఆగస్టు 28 నుంచి దేశవాళీ సీజన్ ప్రారంభమయ్యే దృష్ట్యా, BCCI ఇటీవల బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫాస్ట్ బౌలర్ల కోసం ప్రాక్టీస్‌ శిబిరాన్ని నిర్వహించింది.

By Medi Samrat
Published on : 17 Aug 2025 9:09 PM IST

బుమ్రా, సిరాజ్‌ల‌ వారసులకై వేట.. అక్క‌డ మెరిసిన‌ శ్రేయాస్ అయ్యర్..!

దులీప్ ట్రోఫీతో ఆగస్టు 28 నుంచి దేశవాళీ సీజన్ ప్రారంభమయ్యే దృష్ట్యా, BCCI ఇటీవల బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫాస్ట్ బౌలర్ల కోసం ప్రాక్టీస్‌ శిబిరాన్ని నిర్వహించింది. బీసీసీఐ విడుదల చేసిన క్యాంప్ వీడియోలో ఇంగ్లండ్ టూర్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన బౌలర్లు హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్ క్యాంప్‌లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. వీరే కాకుండా, సుయాష్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ కూడా ఇక్కడ కనిపించారు. వారు కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రెగ్యులర్ ఫిట్‌నెస్ పరీక్షలో భాగమైనట్లు తెలుస్తుంది. శిబిరంలో అండర్-19 గ్రూప్ నుండి 22 మంది ఫాస్ట్ బౌలర్లు, 14 మంది టార్గెట్ ఫాస్ట్ బౌలర్లు, ఎనిమిది మంది ఫాస్ట్ బౌలర్లు నైపుణ్యాలు, ఫిట్‌నెస్‌కు సంబంధించిన వివిధ అంశాలపై ఇంటెన్సివ్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు.

దీనికి సంబంధించి BCCI ఆదివారం తన ఇంటర్నెట్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు చెందిన ఫాస్ట్ బౌలింగ్ కోచ్ ట్రాయ్ కూలీ మార్గదర్శకత్వంలో ఆటగాళ్లు ఫిట్‌నెస్ టెస్టుతో పాటు నైపుణ్యం అభివృద్ధి, వ్యూహాత్మక నైపుణ్యాల నిర్మాణంపై కూడా పనిచేశారని రాశారు.

ఈ వీడియోలో సిమర్‌జీత్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, సూర్యాంశ్ షెడ్గే, గుర్జప్నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్ చరక్ కూడా ఉన్నారు. సమాచారం ప్రకారం.. విజయ్‌కుమార్ వైశాఖ్, ఖలీల్ అహ్మద్, యష్ ఠాకూర్‌, రాజ్ బావా కూడా ఈ శిబిరంలో భాగమయ్యారు. ఈ విస్తృతమైన ఫాస్ట్ బౌలింగ్ శిబిరం భవిష్యత్తులో ఏదైనా అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ లేదా టోర్నమెంట్‌లో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ వంటి బౌలర్‌లకు మద్దతు ఇవ్వడానికి భారత జట్టుకు మరింత ఫాస్ట్ బౌలింగ్ ఆప్ష‌న్‌ల‌ను అందిస్తుందని భావిస్తున్నారు.

Next Story