బీసీసీఐ ఎవరినీ సంప్రదించలేదు.. ఆ అవగాహన వ్యక్తే టీమిండియా కోచ్ : జై షా
2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. దీంతో టీమిండియా ప్రధాన కోచ్‌ని మార్చనున్నారు.
By Medi Samrat Published on 24 May 2024 8:00 AM GMT2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. దీంతో టీమిండియా ప్రధాన కోచ్‌ని మార్చనున్నారు. ఈ పోస్టుల భర్తీకి బీసీసీఐ ఇటీవల దరఖాస్తులను ఆహ్వానించింది. ఇంతలో BCCI రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్‌లను ప్రధాన కోచ్‌లుగా నియమించనున్నట్లు అనేక నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ నివేదికలను బీసీసీఐ సెక్రటరీ జయ్ షా తోసిపుచ్చారు. ఏ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌కు కూడా కోచింగ్‌కు సంబంధించి బోర్డు ఎలాంటి ప్రతిపాదన చేయలేదని చెప్పాడు. దేశవాళీ క్రికెట్‌పై మంచి అవగాహన ఉన్న అనుభవజ్ఞుల కోసం బీసీసీఐ వెతుకుతుందని చెప్పాడు.
నేను కానీ బీసీసీఐ కానీ ఏ మాజీ ఆస్ట్రేలియా ఆటగాడిని సంప్రదించలేదని.. కొన్ని మీడియా ఛానళ్లలో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని షా అన్నారు. పాంటింగ్, లాంగర్ ఇద్దరూ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్‌లకు ప్రధాన కోచ్‌లుగా ఉన్నారు.
జయ్ షా మాట్లాడుతూ "మా జాతీయ జట్టుకు సరైన కోచ్‌ను కనుగొనడం అనేది సమగ్రమైన ప్రక్రియ. మేము భారత క్రికెట్ నిర్మాణంపై లోతైన అవగాహన కలిగి ఉన్న వ్యక్తులను గుర్తించడంపై దృష్టి సారించాము. భారత దేశవాళీ క్రికెట్‌పై అవగాహన కలిగి ఉండటం.. తదుపరి కోచ్‌ను నియమించడానికి ముఖ్యమైన ప్రమాణాలలో ఒకటి అని బీసీసీఐ కార్యదర్శి వెల్లడించారు. టీమ్‌ఇండియాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ అవగాహన ముఖ్యమని అన్నాడు.
గౌతమ్ గంభీర్ కూడా ప్రధాన కోచ్ కోసం పోటీదారు. వాస్తవానికి బీసీసీఐ ఈ విషయాన్ని గంభీర్ తో చర్చించినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా ఉన్నాడు. అతని మెంటార్‌షిప్‌లో కోల్‌కతా ఫైనల్స్‌కు చేరుకుంది. అంతకుముందు గంభీర్ లక్నో సూపర్ జెయింట్ మెంటార్‌గా ఉన్నాడు. రెండేళ్లపాటు లక్నో టీమ్‌కు మెంటార్‌గా కొనసాగాడు. IPL 2024లో అతడు తన సొంత జట్టుకు మెంటర్‌గా తిరిగి వచ్చాడు.
ఇటీవల బీసీసీఐ సెక్రటరీ జయ్ షా వివిధ ఫార్మాట్లకు ప్రత్యేక కోచ్ ఉండరని స్పష్టం చేశారు. అటువంటి పరిస్థితిలో మూడు ఫార్మాట్‌లకు ఒకే కోచ్ కోసం అన్వేషణ ఉంటుంది. కొత్త కోచ్ 3.5 సంవత్సరాల పాటు భారత క్రికెట్ జట్టుకు సేవలందించాల్సి వుంటుంది. టీ20 ప్రపంచకప్ తర్వాత ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. దరఖాస్తులకు మే 27 చివరి తేదీగా బీసీసీఐ నిర్ణయించింది.