భార‌త్‌,ఆస్ట్రేలియా మూడో టెస్టు.. వేదిక మారింది

BCCI confirms third Test shifted from Dharamsala to Indore.ఆస్ట్రేలియా, భార‌త్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన మూడో టెస్టు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Feb 2023 12:07 PM IST
భార‌త్‌,ఆస్ట్రేలియా మూడో టెస్టు.. వేదిక మారింది

బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భార‌త్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన మూడో టెస్టు మ్యాచ్ వేదిక‌ మారింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లోని హోల్క‌ర్ స్టేడియంలో మార్చి 1 నుంచి మూడో టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ట్లు భార‌త క్రికెట్ కంటోల్ బోర్డు(బీసీసీఐ) ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

వాస్త‌వానికి ఈ మ్యాచ్ ధ‌ర్మ‌శాల‌లో జ‌ర‌గాల్సి ఉంది. అయితే.. ధ‌ర్మ‌శాల స్టేడియంలో ఔట్‌ఫీల్డ్, పిచ్‌పై ప‌చ్చిక‌ను కొత్త‌గా ప‌రిచారు. పిచ్‌ను ప‌రీక్షించ‌డం స‌హా మ‌రికొన్ని ప‌నులు ఇంకా పూర్తి కాలేదు. బీసీసీఐ క్యూరేటర్ తపోష్ ఛటర్జీ స్టేడియం పిచ్, ఔట్ ఫీల్డ్‌ను తనిఖీ చేసి బోర్డుకు నివేదిక అందించాడు. ఈ నివేదిక ఆధారంగా ఇక్క‌డ టెస్టు మ్యాచ్ నిర్వ‌హించ‌డం సాధ్యం కాద‌ని బావించిన బీసీసీఐ వేదిక‌ను మార్చింది.

ధ‌ర్మ‌శాల‌లో మ్యాచ్ నిర్వ‌హ‌ణ సాధ్యం కాక‌పోవ‌డంతో ఈ మ్యాచ్‌ను విశాఖ‌ప‌ట్నం లేదా బెంగ‌ళూరుకు త‌ర‌లిస్తార‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే చివ‌రికి ఇండోర్‌ని ఖ‌రారు చేస్తూ బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంది.

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా 132 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో భార‌త్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఫిబ్ర‌వ‌రి 17 నుంచి ఢిల్లీ వేదిక‌గా రెండో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లోనూ ఆసీస్ పై విజ‌యం సాధించాల‌ని టీమ్ఇండియా బావిస్తుండ‌గా, తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభ‌వానికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని ఆసీస్ ప‌ట్టుద‌ల‌తో ఉంది.

Next Story