ఇంగ్లండ్ టూర్ ముందు బీసీసీఐ సంచలన నిర్ణయం..గంభీర్ టీమ్‌లో ప్రక్షాళన
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత టీమిండియాలో బీసీసీఐ భారీ మార్పులు చేస్తోంది.
By Knakam Karthik
ఇంగ్లండ్ టూర్ ముందు బీసీసీఐ సంచలన నిర్ణయం..గంభీర్ టీమ్‌లో ప్రక్షాళన
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత టీమిండియాలో బీసీసీఐ భారీ మార్పులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ పర్యటనకు ముందు బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. టీమ్‌ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ బృందంలో ముగ్గురిపై బీసీసీఐ వేటు వేసింది. అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్‌ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, గతేడాది న్యూజిలాండ్ , ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లలో భారత జట్టు వరుస పరాజయాలను చవిచూసిన నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కేవలం 8 నెలల వ్యవధిలోనే అభిషేక్ నాయర్‌ను విధుల నుంచి తొలగించడం ప్రస్తుతం భారత క్రికెట్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఇక ఇటీవల ముగిసిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమ్‌ఇండియా పేలవ ప్రదర్శనతో దారుణంగా విఫలమై 1-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ఫలితంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలు గల్లంతయ్యాయి. ఈ సిరీస్‌లో రోహిత్, కోహ్లీ పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచారు. కోహ్లీ పెర్త్ టెస్టులో సెంచరీ మినహా రాణించలేదు. ఆఫ్ స్టంప్ ఆవల బంతిని వేటాడే తన బలహీనతను కొనసాగిస్తూ వికెట్లు సమర్పించుకున్నాడు. ఇలా ఈ సిరీస్‌లో ఎనిమిది సార్లు అతడు పెవిలియన్ బాట పట్టాడు. ఇక ఈ సిరీస్‌లో రోహిత్ ప్రదర్శన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అతడు ఆడిన మూడు టెస్టుల్లో చేసిన మొత్తం పరుగులు 31 మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే ఆటతీరుపై సమీక్ష చేపట్టిన బీసీసీఐ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.