జ‌న‌వ‌రి టూ మార్చి.. స్వ‌దేశంలో టీమ్ఇండియా వ‌రుస సిరీస్‌లు.. షెడ్యూల్ విడుద‌ల‌

BCCI announces schedule for home series.కొత్త ఏడాదిలో టీమ్ఇండియా షెడ్యూల్ పుల్ బిజీగా ఉంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Dec 2022 4:55 PM IST
జ‌న‌వ‌రి టూ మార్చి.. స్వ‌దేశంలో టీమ్ఇండియా వ‌రుస సిరీస్‌లు.. షెడ్యూల్ విడుద‌ల‌

కొత్త ఏడాదిలో టీమ్ఇండియా షెడ్యూల్ పుల్ బిజీగా ఉంది. జ‌న‌వ‌రి నుంచి మార్చి వ‌ర‌కు స్వ‌దేశంలో శ్రీలంక‌, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జ‌ట్ల‌తో సిరీస్‌లు ఆడ‌నుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) గురువారం విడుద‌ల చేసింది. వ‌చ్చే ఏడాది స్వ‌దేశంలోనే వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో జ‌ట్టు ఎంపిక‌కు ఈ సిరీస్‌ల‌ను ఉప‌యోగించుకోవాల‌ని భార‌త టీమ్‌మేనేజ్‌మెంట్ బావిస్తోంది. మూడు నెల‌ల కాలంలో టీమ్ఇండియా 9 వన్డేలు, 6 టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడ‌నుంది.

శ్రీలంక‌

జ‌న‌వ‌రి మూడు నుంచి 15 వ‌ర‌కు శ్రీలంక జ‌ట్టు భారత ప‌ర్య‌ట‌న‌కు రానుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో లంక జ‌ట్టు మూడు వ‌న్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల‌ను ఆడ‌నుంది

మూడు టీ20ల సిరీస్‌లో తొలి టీ 20 జ‌న‌వ‌రి 3న‌ ముంబైలో ఆరంభంకానుంది. రెండో టీ 20 జ‌న‌వ‌రి 5న పూనేలో, మూడో టీ20 జ‌న‌వ‌రి 7న‌ రాజ్‌కోట్‌లో జ‌రుగుతాయి. అనంత‌రం తొలి వ‌న్డే జ‌న‌వ‌రి 10న‌ గువ‌హ‌తిలో, రెండో వ‌న్డే జ‌న‌వ‌రి 12న‌ కోల్‌క‌తాలో, మూడో వ‌న్డే జ‌న‌వ‌రి 15న‌ త్రివేండ్రంలో జ‌ర‌గ‌నుంది.

న్యూజిలాండ్

జ‌న‌వ‌రి 18 నుంచి ఫిబ్ర‌వ‌రి 1 వ‌ర‌కు న్యూజిలాండ్ జ‌ట్టు భార‌త్‌లో ప‌ర్య‌టించ‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో కివీస్ తో భార‌త్ మూడు వ‌న్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడ‌నుంది.

తొలి వ‌న్డే జ‌న‌వ‌రి 18న హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. జ‌న‌వ‌రి 21న‌ రెండో వ‌న్డే రాయ్‌పూర్‌లో, జ‌న‌వ‌రి 24న మూడో వ‌న్డే ఇండోర్‌లో జ‌ర‌గ‌నున్నాయి. అనంత‌రం మూడు టీ 20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ జ‌న‌వ‌రి 27 న రాంచీలో, రెండో టీ 20 మ్యాచ్ ల‌క్నోలో, మూడో టీ 20 ఫిబ్ర‌వ‌రి 1న అహ్మ‌దాబాద్‌లో జ‌ర‌గ‌నుంది.

ఆస్ట్రేలియా

ఫిబ్ర‌వ‌రి 9 నుంచి మార్చి 22 వ‌ర‌కు ఆస్ట్రేలియా జ‌ట్టు భార‌త్‌లో ప‌ర్య‌టించ‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆసీస్ బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టులు, మూడు వ‌న్డేలు ఆడ‌తుంది.

ఫిబ్ర‌వ‌రి 9 నుంచి 13 వ‌ర‌కు నాగ్‌పూర్‌లో తొలి టెస్టు, ఫిబ్ర‌వ‌రి 17 నుంచి 21 వ‌ర‌కు ఢిల్లీలో రెండో టెస్టు, మార్చి 1 నుంచి 5 వ‌ర‌కు ధ‌ర్మ‌శాల‌లో మూడో టెస్ట్, మార్చి 9 నుంచి 13 వ‌ర‌కు అహ్మ‌దాబాద్‌లో నాలుగో టెస్ట్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అనంత‌రం వ‌న్డే సిరీస్‌లో భాగంగా తొలి వ‌న్డే మార్చి17న ముంబైలో, మార్చి 19 విశాఖ‌లో రెండో వ‌న్డే, మార్చి 22న చైన్నైలో మూడో వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ఆసీస్‌తో జ‌రిగే నాలుగు టెస్టుల సిరీస్‌కు భార‌త్‌కు చాలా కీల‌కం. వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించాలంటే ఈ సిరీస్‌లో భార‌త జ‌ట్టు గెల‌వాల్సి ఉంటుంది.

Next Story