రిషభ్ పంత్ కు భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ
BCCI announces new vice-captain for 1st Test match against Bangladesh. టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) షాకిచ్చింది.
By Medi Samrat
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) షాకిచ్చింది. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు పంత్ ను తప్పించిన బీసీసీఐ.. ఇప్పుడు అతని వైస్ కెప్టెన్సీపై వేటు వేసింది. రోహిత్ శర్మ అందుబాటులో లేనప్పుడు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేస్తే.. రిషభ్ పంత్ వైస్ కెప్టెన్సీ చేసేవాడు. ఇంగ్లండ్ తో ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో జస్‌ప్రీత్ బుమ్రాకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పినప్పుడు కూడా పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు పంత్ అందుబాటులో ఉన్నా చతేశ్వర్ పుజారాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. వన్డే సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్లు చాలా మంది గాయపడటంతో యువ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది.
రోహిత్ శర్మ గాయపడడంతో కేఎల్ రాహుల్‌కు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ముందుగా రెండు టెస్టు మ్యాచ్‌లు పదకొండు గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు మ్యాచ్‌ల సమయాన్ని తొమ్మిది గంటలకు మార్చేశారు. రోహిత్ శర్మ గాయం కారణంగా బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు దూరమవడంతో అతడి స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ ఎంపికయ్యాడు. ''రోహిత్ ముంబైలో స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాడు. బంగ్లాతో మొదటి టెస్టుకు అతడు అందుబాటులో ఉండడు. రోహిత్ రెండో టెస్టులో ఆడే విషయంపై బీసీసీఐ మెడికల్ టీమ్ నిర్ణయం తీసుకుంటుంది. సెలక్షన్ కమిటీ రోహిత్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేసింది" అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయాల నుండి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో వీరిద్దరూ టెస్టు సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. వీరిద్దరికి బదులుగా నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్ జట్టులోకి వచ్చారు. అలాగే జయదేవ్ ఉనద్కత్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు.