భారత టెస్టు జట్టులో ఎన్ని మార్పులో.. విండీస్‌తో సిరీస్ ఆడేది వీరే..!

త్వ‌ర‌లో వెస్టిండీస్‌తో జరిగే 2-టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును గురువారం ప్రకటించారు.

By -  Medi Samrat
Published on : 25 Sept 2025 2:27 PM IST

భారత టెస్టు జట్టులో ఎన్ని మార్పులో.. విండీస్‌తో సిరీస్ ఆడేది వీరే..!

త్వ‌ర‌లో వెస్టిండీస్‌తో జరిగే 2-టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును గురువారం ప్రకటించారు. శుభ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోని 15 మంది సభ్యుల జట్టులో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం నుంచి కోలుకుంటున్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఈ సిరీస్‌లో ఆడ‌టం లేదు. దీంతో రవీంద్ర జడేజాకు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. దేవదత్ పడిక్కల్ టెస్టు జట్టులోకి తిరిగి వచ్చాడు. కరుణ్ నాయర్‌కు చోటు ద‌క్క‌లేదు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో విఫ‌ల‌మైన నాయర్‌ను జట్టు నుంచి తప్పించారు. అతనిపై జట్టు మరింతగా అంచనాలు పెట్టుకుందని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. కరుణ్ నాయర్‌పై మాకు ఎక్కువ అంచనాలు ఉండేవి.. అత‌డొక్క‌డికి మాత్రమే కాదు.. పడిక్కల్‌కు కూడా అవకాశాలు ఇవ్వనున్నామ‌ని.. అందరికీ 15-20 ఛాన్స్‌లు ఇవ్వాలనుకుంటున్నామని, అయితే ఈ పరిస్థితుల్లో నాయ‌ర్‌ను జ‌ట్టులోకి తీసుకోవ‌డం కుదరదని అన్నాడు.

శార్దూల్ ఠాకూర్, అభిమన్యు ఈశ్వరన్, అర్షదీప్ సింగ్, ఆకాష్ దీప్, హర్షిత్ రాణా గ‌త ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టులో ఉన్నారు. అయితే.. వెస్టిండీస్‌తో జరిగే భారత జట్టులో వారిని ఎంపిక చేయలేదు. ఫామ్‌లో ఉన్న తమిళనాడు వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్ నారాయణ్ జగదీశన్ ఇంగ్లండ్ పర్యటనలో తొలిసారిగా భారత జట్టులోకి వచ్చాడు. పంత్ లేకపోవడంతో అత‌డు జట్టులోకి ఎంపికయ్యాడు. దీంతో పాటు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా జట్టులోకి వచ్చాడు.

వెస్టిండీస్‌తో సిరీస్‌ కోసం భారత జట్టు

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిద్ కృష్ణ, నారాయణ్ జగదీశన్, అక్షర్ పటేల్

టెస్ట్ సిరీస్ షెడ్యూల్

మొదటి టెస్ట్: అక్టోబర్ 2 నుండి 6 వరకు - అహ్మదాబాద్

రెండవ టెస్ట్: అక్టోబర్ 10 నుండి 14 వరకు - ఢిల్లీ

Next Story